జొకోవిచ్‌ పవర్‌ ఫుల్‌ షాట్‌.. పాపం ఫెడరర్‌

22 Sep, 2018 20:12 IST|Sakshi

చికాగో: సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌, స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ మధ్య పోరు టెన్నిస్‌ అభిమానులకు పండగే. కానీ ఈ ఇద్దరు దిగ్గజాలే జత కడితే ప్రత్యర్థికి చుక్కలే. ఫెడరర్‌ పక్కా ప్రణాళికలు.. జొకోవిచ్‌ సందడి, గెలుపు తర్వాత అతడు చేసే చిలిపి పనులు అందరిని ఆశ్చర్యానికి గురిచేసేవే. చికాగోలో జరుగుతున్న ల్యావెర్‌ కప్‌ కోసం ఈ ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు యూరప్‌ తరుపున జతకట్టారు. కానీ ఈ మ్యాచ్‌లో జాక్‌ సాక్‌(యూఎస్‌ఏ)- కెవిన్‌ అండర్సన్‌(సౌతాఫ్రికా) జోడిపై 6-7(5) 6-3 10-6 లెజండరీ జోడీ ఓటమి చవిచూసింది. మ్యాచ్‌ సందర్బంగా ఓ వినూత్న సంఘటన చోటుచేసుకుంది. జొకోవిచ్‌ కొట్టిన షాట్‌ గురి తప్పి ఫెడరర్‌కు బలంగా తాకింది. సెర్బియా స్టార్‌ కొట్టిన షాట్‌ బలంగా తాకడంతో ఫెడరర్‌ విలవిల్లాడాడు. ఫెడరర్‌కు బలంగా బంతి తగలడంతో జొకోవిచ్‌ కూడా ఆశ్యర్యంతో పాటు, ఆందోళనకు గురయ్యాడు. త్వరగా అతడి దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పినట్లు వీడియోల కనిపిస్తుంది. ప్రసుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

రఫెల్‌ నాదల్‌తో జతకట్టి గెలిచిన ఫెడరర్‌.. జొకోవిచ్‌తో జతకట్టి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో సెర్బియా స్టార్‌ తన అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. అదే అమెరికా, దక్షిణాఫ్రికా జోడి సాక్‌-అండర్సన్‌ అసాధరణ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తొలి సెట్‌ కోల్పోయినప్పటికి రెండో సెట్‌లో పుంజుకొని మ్యాచ్‌ను కాపాడుకున్నారు. చెరోసెట్‌ గెలవడంతో టై బ్రేకర్‌ ఆడాల్సివచ్చింది. దీంతో టై బ్రేకర్‌లోనూ అదరగొట్టి సాక్‌-అండర్సన్‌ జోడి విజయం సాదించింది. దీంతో యూరప్‌ జట్టు ఈ టోర్నీలో తొలి ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌ ఓడినప్పటికీ 3-1తో యూరప్‌ జట్టు ఆధిక్యంలో ఉంది. 

మరిన్ని వార్తలు