'మా జట్టుకు వైట్‌వాష్‌ తప్పదేమో'

8 Dec, 2017 15:57 IST|Sakshi

అడిలైడ్‌: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్లకు ప్రతిష్టాత్మక సిరీస్‌ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క యాషెస్‌ సిరీస్‌. ఈ క‍్రమంలోనే యాషెస్‌ సిరీస్‌ను ఇరు జట్ల ఆటగాళ్లు ప్రతీ మ్యాచ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. కేవలం ఆటగాళ్లే కాదు.. ఆయా దేశాభిమానులు కూడా యాషెస్‌ సిరీస్‌కు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. అయితే తాజాగా జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ వరుస రెండు టెస్టుల్లో ఘోర ఓటమి పాలవ్వడంపై ఆ దేశ దిగ్గజ కెప్టెన్లు మైకేల్‌ వాన్‌, బాబ్‌ విల‍్లిస్‌లు మండిపడుతున్నారు.

తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌ ఎటువంటి పోరాటం లేకుండా లొంగిపోవడాన్ని వీరు తప్పుబడుతున్నారు. ఈ క‍్రమంలోనే తమ జట్టుకు వైట్‌వాష్‌ తప్పదేమో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ' ఈ వారం ఇంగ్లండ్‌ చేదు అనుభవమే ఎదురైంది. తదుపరి పెర్త్‌లో జరిగే మూడో టెస్టు పెద్దగా స్వింగ్‌కు అనుకూలించదు. అడిలైడ్‌ పిచ్‌ తరహాలోనే ఉంటుంది. ఇక్కడ కూడా మా జట్టు గెలవడం కష్టమే. ఒకసారి 2013, 2006-07 సీజన్‌ యాషెస్‌ సిరీస్‌ల్లో ఏమి జరిగిందో చూడండి. కనీసం ఆసీస్‌ను ఒక్కమ్యాచ్‌ కూడా గెలవనివ్వలేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆటను కొనసాగించండి. ఇలా అయితే ఈ పర్యటనలో ఇంగ్లండ్‌ కనీసం మ్యాచ్‌ను కూడా గెలవడం కష్టమే' అని వాన్‌ విమర్శించాడు. మరొకవైపు విల్లిస్‌ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అడిలైడ్‌ టెస్టులో ఇంగ్లండ్‌ గెలుపును అందిపుచ‍్చుకోలేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. ఒకవేళ 5-0తో ఇంగ్లండ్‌ వైట్‌వాష్‌ అయినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని విల్లిస్‌ మండిపడ్డాడు.

మరిన్ని వార్తలు