ఐసీసీ రూల్స్‌.. చూయింగ్‌ గమ్‌ మాటేంటి?: డుప్లెసిస్‌

8 Jul, 2018 14:19 IST|Sakshi

కేప్‌టౌన్‌: బాల్‌ ట్యాంపరింగ్‌ పాల్పడే క్రికెటర్ల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) కొత్త రూల్స్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ తప్పిదానికి పాల్పడే వారు కనిష్టంగా ఆరు టెస్టులు లేదా 12 వన్డేల నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే 12 సస్పెన్షన్‌ పాయింట్లనూ విధిస్తూ ఐసీసీ నిబంధనల్ని సవరించింది. అయితే దీనిపై మరింత స్పష్టత కోరుతున్నాడు దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌. ‘ ట్యాంపరింగ్‌ పాల్పడే వారి పట్ల రూల్స్‌ను కఠినతరం చేశారు. అంతవరకూ బాగానే ఉంది.  బాల్‌ ట్యాంపరింగ్‌ కొత్త రూల్స్‌పై నాకు ఇంకా క్లియరెన్స్‌ లేదు. జట్టు సభ్యులు గ్రౌండ్‌లోకి వెళ్లేటప్పుడు ఏమి తీసుకెళ్లాలి.. ఏది తీసుకెళ్లకూడదు అనే దానిపై ఏమీ చెప్పలేదు. మ్యాచ్‌ జరుగుతున‍్నప్పుడు క్రికెటర్లు చూయింగ్‌ గమ్‌ నమలడానికి అనుమతి ఉందా? లేదా చెప్పండి’ అని డుప్లెసిస్‌ డిమాండ్‌ చేశాడు.

దీనిపై మరొక దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా స్పందిస్తూ.. ‘నాకు ఫీల్డ్‌లో మింట్స్‌ను నమలడం అలవాటు. ఎక్కువ సేపు మైదానంలో ఉన్న సమయంలో వాటిని తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదనే అనుకుంటున్నా. దీనిపై నాకు కూడా క్లారిటీ కావాలి’ అని ప్రశ్నించాడు.

మరిన్ని వార్తలు