కెప్టెన్‌ అతడే.. కానీ టాస్‌కు దూరం!

18 Oct, 2019 17:02 IST|Sakshi

రాంచీ:  టీమిండియాతో చివరి టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్న దక్షిణాఫ్రికా.. ముందుగా టాస్‌ గెలిస్తే సగం పని అయిపోయినట్లేనని బలంగా నమ్ముతోంది. వరుస రెండు టెస్టుల్లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లినే టాస్‌ గెలవడమే ఆ జట్టు విజయాలు నమోదు చేయడానికి కారణంగా దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ అనుకుంటున్నాడు. దాంతో రేపు(శనివారం) రాంచీ వేదికగా ఆరంభం కానున్న ఆఖరిదైన మూడో టెస్టులో తాను టాస్‌ దాదాపు రాబోనని సంకేతాలు ఇచ్చాడు డుప్లెసిస్‌. ప్రి మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో డుప్లెసిస్‌ మాట్లాడుతూ.. తమ జట్టు అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నట్లు పేర్కొన్నాడు. దాన్ని టాస్‌ నుంచే ఆరంభించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.

‘ మూడో టెస్టు మ్యాచ్‌కు టాస్‌కు వేరే క్రికెటర్‌ని పంపుతా. టాస్‌ విషయంలో నా రికార్డు బాలేదు. దాంతో వేరే ఇంకొకర్ని టాస్‌కు పంపాలనుకుంటున్నా. టాస్‌ గెలిస్తే తొలి ఇన్నింగ్స్‌లో భారీ పరుగులు చేసే అవకాశం దొరుకుతుందనేది నా యోచన. ఆరంభానికి తొలి ఇన్నింగ్స్‌ కీలకం. గత రెండేళ్ల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాను కట్టడి చేయాలంటే ఆది  నుంచి ప్రణాళికలు సమర్ధవంతంగా అమలు చేయాలి. మొదటి రోజు పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తుంది. దాంతో టాస్‌ గెలవడంపైనే దృష్టి పెట్టాం. ఈ తరుణంలో నేను టాస్‌కు రావాలనుకోవడం లేదు’ అని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు.(ఇక్కడ చదవండి: కొత్త చరిత్రపై టీమిండియా గురి)

గత నెలలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ మహిళా కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ ఇదే తరహాలో టాస్‌కు అలిస్సా హీలేను వెంటబెట్టుకొచ్చారు. మ్యాచ్‌ రిఫరీ కాయిన్‌ను హీలేకు ఇచ్చి టాస్‌ వేయమన్నాడు. అయితే అనూహ్యంగా ఆసీస్‌ టాస్‌ గెలిచింది. అనంతరం హీలే పక్కకు తప్పుకోవడంతో రెగ్యులర్‌ కెప్టెన్‌ లానింగ్‌ వచ్చి తొలుత బ్యాటింగ్‌ చేయనున్నట్లు ప్రకటించింది.  ఇక టాస్‌ గెలవడంతో హీలే మైదానంలో గంతులు వేసింది. 

మరిన్ని వార్తలు