మీకు రాహుల్ కావాలి..కానీ కార్తీక్‌ వద్దా?

16 Feb, 2019 13:00 IST|Sakshi

న్యూడిల్లీ: ఆస్ట్రేలియాతో స‍్వదేశంలో జరగబోయే పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా రెండు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేలకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్‌కు ముందు జరుగనున్న ఈ సిరీస్‌లో దినేశ్‌ కార్తీక్‌ను ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఇప్పటికే పలువురు క్రికెట్‌ ప్రముఖులు దినేశ్‌ కార్తీక్‌ను ఎంపిక చేయకపోవడాన్ని ఖండించగా, ఫ్యాన్స్‌ కూడా అతనికి అండగా నిలుస్తున్నారు.  గతేడాదిగా నిలకడగా రాణిస్తున్న కార్తీక్‌ను తీసేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆటగాళ్ల ఎంపికలో ఈ స్కూల్‌ పాలిటిక్స్‌ ఏంటని అంటున్నారు.

ఇక్కడ కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేయడాన్ని ప్రధానంగా తప్పుబడుతున్నారు. ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చినా అంతగా ఆకట్టుకోలేని రాహుల్‌ను ఎలా ఎంపిక చేశారని అభిమానులు నిలదీస్తున్నారు. ‘ఎవరినైనా అడగండి.. దినేశ్‌ కార్తీక్‌, రాహుల్‌లో ఎవరికి ఓటేస్తారు అంటే’ కచ్చితంగా కార్తీక్‌ వైపే మొగ్గు చూపుతారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఎవరినైనా ఫామ్‌ ఆధారంగా ఎంపిక చేయాలి కానీ ఫామ్‌లో లేని ఆటగాడ్ని జట్టులోకి తిరిగి ఎలా తీసుకుంటారని ఫైర్‌ అవుతున్నారు. ఇక ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా కార్తీక్‌కు ఇది కష్ట సమయంగా పేర్కొన్నాడు. అయితే ఇది వరల్డ్‌కప్‌ నుంచి దినేశ్‌ కార్తీక్‌ తప్పించే క్రమంలో సెలక్టర్లు తీసుకున్న ఫైనల్‌ నిర్ణయం కాదనే తాను అనుకుంటున్నట్లు తెలిపాడు.

మరిన్ని వార్తలు