WC 2023: రోహిత్‌, ద్రవిడ్‌ను వివరణ అడిగిన బీసీసీఐ.. హెడ్‌కోచ్‌ ఆన్సర్‌ ఇదే?!

3 Dec, 2023 15:31 IST|Sakshi
రోహిత్‌ శర్మ, ద్రవిడ్‌ను వివరణ అడిగిన బీసీసీఐ (PC: BCCI)

వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా ద్రవిడ్‌ అహ్మదాబాద్‌ పిచ్‌ తయారు చేసిన విధానం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

కాగా ప్రపంచకప్‌ ఫైనల్లో పరాజయంతో రోహిత్‌ సేనతో పాటు కోట్లాది అభిమానుల హృదయాలు ముక్కలైన విషయం తెలిసిందే. లీగ్‌ దశలో తొమ్మిదికి తొమ్మిది గెలిచి.. సెమీస్‌లోనూ సత్తా చాటిన భారత జట్టు తుదిపోరులో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది.

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచిపోయింది. సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత ట్రోఫీ గెలుస్తుందని ధీమాగా ఉన్న రోహిత్‌ సేనకు షాకిచ్చిన ఆసీస్‌ ఆరోసారి జగజ్జేతగా నిలిచింది.

ఈ నేపథ్యంలో ఆసీస్‌తో ఫైనల్లో టీమిండియా వైఫల్యంపై బీసీసీఐ రాహుల్‌ ద్రవిడ్‌, రోహిత​ శర్మను వివరణ అడిగినట్లు దైనిక్‌ జాగరణ్‌ తాజాగా కథనం వెలువరించింది. ఇందులో ఉన్న వివరాల ప్రకారం.. 

బీసీసీఐ సమావేశానికి రాహుల్‌ ద్రవిడ్‌ ప్రతక్ష్యంగా హాజరు కాగా.. కుటుంబంతో పాటు లండన్‌ పర్యటనలో ఉన్న రోహిత్‌ శర్మ వీడియో కాల్‌ ద్వారా అటెండ్‌ అయ్యాడు. 

బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, కోశాధికారి రాజీవ్‌ శేఖర్‌ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో.. టీమిండియా వైఫల్యం గురించి ద్రవిడ్‌, రోహిత్‌ శర్మను వివరణ కోరారు.

ఇందుకు బదులుగా.. నరేంద్ర మోదీ స్టేడియంలో తయారు చేసిన స్లో ట్రాక్‌ తమ అవకాశాలను దెబ్బకొట్టిందని ద్రవిడ్‌ సమాధానమిచ్చాడు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఊహించినట్లుగా పిచ్‌ నుంచి సహకారం అందలేదని.. బంతి ఎక్కువగా టర్న్‌ కాకపోవడం ప్రభావం చూపిందని ద్రవిడ్‌ తెలిపాడు. 

ఆస్ట్రేలియా బ్యాటర్లను స్పిన్‌ మాయాజాలంతో తిప్పలు పెట్టాలన్న వ్యూహాలు ఫలించలేదని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. కాగా మోదీ స్టేడియంలో నవంబరు 19న టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ చేసింది. రోహిత్‌ శర్మ 47 పరుగులు, విరాట్‌ కోహ్లి 54, కేఎల్‌ రాహుల్‌ 66 పరుగులతో రాణించారు.

ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు టీమిండియా ఆలౌట్‌ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌ను ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ 137 పరుగులతో రాణించి విజయతీరాలకు చేర్చాడు. తద్వారా కంగారూ జట్టు మరోసారి వన్డే వరల్డ్‌కప్‌ చాంపియన్‌గా నిలిచింది. 

చదవండి: Ind vs Pak: మెగా క్రికెట్‌ టోర్నీ షెడ్యూల్‌ విడుదల.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ ఆరోజే

మరిన్ని వార్తలు