షో చేయకపోవడం రాకపోవచ్చు కానీ.. భారత్‌, పాక్‌ మాజీ క్రికెటర్లు సమర్థులే: గంభీర్‌

3 Dec, 2023 16:48 IST|Sakshi

టీమిండియా, పాకిస్తాన్‌ కోచింగ్‌ సిబ్బందిని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. విదేశీ కోచ్‌ల సేవల కోసం తాపత్రయ పడకుండా.. స్వదేశీ క్రికెటర్లను మార్గ నిర్దేశకులుగా నియమించుకుంటే సత్ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

ఇందుకు భారత జట్టు చక్కని ఉదాహరణ అంటూ పరోక్షంగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు చురకలు అంటించాడు. కాగా గత కొన్నేళ్లుగా టీమిండియాకు భారత మాజీ క్రికెటర్లు హెడ్‌కోచ్‌లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చాలాకాలం వరకు రవిశాస్త్రి, అతడి తర్వాత ప్రస్తుతం రాహుల్‌ ద్రవిడ్‌ హెడ్‌కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు.

అయితే, పాకిస్తాన్‌ మాత్రం ఎక్కువగా విదేశీ కోచ్‌లనే నియమించుకుంటోంది. అయితే, వరల్డ్‌కప్‌-2023లో ఘోర పరాభవం తర్వాత మాత్రం పూర్తి ప్రక్షాళనకు సిద్ధమై.. మాజీ క్రికెటర్ల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో గౌతం గంభీర్‌ మాట్లాడుతూ.. ‘‘వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఆడిన విధానం చూసిన తర్వాత.. మనకు బయటి వ్యక్తులు కోచ్‌లుగా అవసరం లేదనే విషయం నిరూపితమైంది.

విదేశీ కోచ్‌ల కంటే మన కోచ్‌లు ఏమాత్రం తక్కువకాదు. అయితే, మనవాళ్లకున్న ప్రధాన సమస్య ఏమిటంటే.. విదేశీ కోచ్‌లలా.. ప్రజెంటేషన్‌ ఇవ్వలేకపోవడం.. ఆ ల్యాప్‌టాప్‌లు పట్టుకుని హల్‌చల్‌ చేయడం.. అనర్గళంగా ఇంగ్లిష్‌ మాట్లాడలేకపోవడం వంటివన్న మాట!

ఎందుకంటే మనది కార్పొరేట్‌ సంస్కృతి కాదు. అయితే, క్షేత్రస్థాయి నుంచే మన ఆటగాళ్లను మెరికల్లా ఎలా తీర్చిదిద్దాలో మనవాళ్లకు బాగా తెలుసు’’ అని గంభీర్‌ స్పోర్ట్స్‌కీడాతో వ్యాఖ్యానించాడు. 

ఇదే షోలో పాల్గొన్న పాక్‌ దిగ్గజ బౌలర్‌ వసీం అక్రంతో చర్చిస్తూ.. ‘‘మనవి ఇప్పుడిప్పుడే క్రికెట్‌ ఆడుతున్న దేశాలు కాదు. వరల్డ్‌కప్‌ గెలిచిన ఆటగాళ్లు మన దగ్గర ఉన్నారు. టీమిండియాను భారత కోచ్‌, పాకిస్తాన్‌ టీమ్‌ను పాకిస్తానీ ముందుకు నడిపించగలరు’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. 

కాగా 2007 టీ20, 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన టీమిండియాలో గంభీర్‌ సభ్యుడు. ఇక 2007లో భారత జట్టుకు కోచ్‌గా లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ వ్యవహరించగా.. 2011లో గ్యారీ కిర్‌స్టన్‌ మార్గదర్శనం చేశాడు.

చదవండి: WC 2023: రోహిత్‌, ద్రవిడ్‌ను వివరణ అడిగిన బీసీసీఐ.. హెడ్‌కోచ్‌ ఆన్సర్‌ ఇదే?!

మరిన్ని వార్తలు