రొనాల్డో ఎఫెక్ట్‌.. ఫియట్‌ కంపెనీకి షాక్‌

13 Jul, 2018 09:21 IST|Sakshi
క్రిస్టియానో రొనాల్డొ

రోమ్‌ : ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ ఆటగాడు, పోర్చుగల్‌ కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డోను తమ యజమాని(ఆగ్నెల్లీ కుటుంబం- యువెంటస్‌ ఫుట్‌బాల్‌ క్లబ్ వాటాదారు) కొనుగోలు చేయడం పట్ల ఫియట్‌ కార్ల సిబ్బంది యూనియన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. యూనియన్‌ లీడర్‌ లావోరో ప్రైవాటో మాట్లాడుతూ.. ‘  సంస్థను సమర్థవంతంగా నడిపించడానికి, అభివృద్ధి సాధించడానికి ఏళ్ల తరబడి ఎన్నో త్యాగాలు చేస్తున్నాం. అయితే ఒ​క ఆటగాడి కోసం వందల మిలియన్‌ యూరోలు ఖర్చు చేయడం చూస్తుంటే కార్మికుల త్యాగాలకు విలువ లేదని అర్థమైంది. అందుకే ఎఫ్‌సీఏ, సీఎన్‌హెచ్‌ఐ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారని’  తెలిపారు. రొనాల్డో కోసం వెచ్చించిన డబ్బును ఉద్యోగ కల్పన కోసం ఖర్చు చేసి ఉంటే ఎంతో బాగుండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రచారం కోసమే...
ప్రఖ్యాత కార్ల కంపెనీలు ఫెరారీ, ఫియట్, యువెంటస్‌ క్లబ్‌లకు మాతృసంస్థ అయిన ఎగ్జార్‌.. రొనాల్డోను కొనుగోలు చేయడం ద్వారా తమ మార్కెట్‌ వ్యాల్యూను పెంచుకోవాలని భావిస్తోంది. జీప్‌ లోగో కలిగి ఉన్న యువెంటస్‌ క్లబ్‌ జెర్సీని రొనాల్డో ధరించడం ద్వారా భారీ స్థాయిలో తమకు ప్రచారం లభిస్తుందనే ఉద్దేశంతోనే 10 కోట్ల 50 లక్షల యూరోలు(846 కోట్ల రూపాయలు) వెచ్చించినట్లు తెలిపింది.

కాగా గత తొమ్మిదేళ్లుగా రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌(స్పెయిన్‌) తరపున ఆడుతున్న రొనాల్డోను ఇటలీకి చెందిన విఖ్యాత ఫుట్‌బాల్‌ క్లబ్‌ యువెంటస్‌ దక్కించుకున్న విషయం తెలసిందే. ఈ రెండు క్లబ్‌ల మధ్య కుదిరిన కొత్త ఒప్పందం ప్రకారం.. యువెంటస్‌ క్లబ్‌ 10 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 846 కోట్లు) రియల్‌ మాడ్రిడ్‌కు చెల్లించనుంది. అలాగే నాలుగేళ్ల పాటు యువెంటస్‌ తరపున ఆడనున్నందుకు గానూ రొనాల్డోకు సీజన్‌కు 3 కోట్ల యూరోలు (రూ. 241 కోట్లు) చొప్పున వేతనంగా లభిస్తాయని సమాచారం.

>
మరిన్ని వార్తలు