రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌ మాజీ అధ్యక్షుడు లొరెంజో మృతి

23 Mar, 2020 05:55 IST|Sakshi

కరోనా వైరస్‌తో కన్నుమూత

మాడ్రిడ్‌ (స్పెయిన్‌): ప్రపంచ ఫుట్‌బాల్‌లో విఖ్యాత క్లబ్‌గా పేరొందిన రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌కు ఐదేళ్లపాటు అధ్యక్షుడిగా వ్యవహరించిన లొరెంజో సాంజ్‌ మృతి చెందారు. కొన్నిరోజుల క్రితం కరోనా వైరస్‌ బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చిక్సిత తీసుకుంటూ ఆదివారం కన్నుమూశారని లొరెంజో కుమారుడు లొరెంజో సాంజ్‌ జూనియర్‌ తెలిపాడు. 76 ఏళ్ల లొరెంజో 1995 నుంచి 2000 వరకు రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన హయాంలో రియల్‌ మాడ్రిడ్‌ జట్టు 1998, 2000లో ప్రతిష్టాత్మక చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 118 ఏళ్ల చరిత్ర ఉన్న రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌ స్పెయిన్‌ దేశవాళీ ఫుట్‌బాల్‌ టోర్నీ లా లీగాలో 33 సార్లు... యూరోప్‌ దేశాల్లోని క్లబ్‌ జట్ల మధ్య జరిగే చాంపియన్స్‌ లీగ్‌ టోర్నీలో 13 సార్లు విజేతగా నిలిచింది. కోవిడ్‌–19 ప్రస్తుతం యూరోప్‌లో విజృంభిస్తోంది. ఒక్క స్పెయిన్‌లోనే ఇప్పటివరకు 1,320 మంది కరోనాతో మృతి చెందారు. 

మరిన్ని వార్తలు