వ్యక్తిగత కారణాలతోనే...

21 May, 2016 01:32 IST|Sakshi
వ్యక్తిగత కారణాలతోనే...

ఆంధ్రకు మారానన్న విహారి
హైదరాబాద్ జట్టుకు గుడ్‌బై


సాక్షి, హైదరాబాద్:  రంజీ క్రికెట్‌లో అడుగు పెట్టిననాటి నుంచి హైదరాబాద్ తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచిన గాదె హనుమ విహారి ఆంధ్రకు మారుతున్నట్లు ప్రకటించాడు. వచ్చే సీజన్ నుంచి తాను ఆంధ్ర జట్టు తరఫునే బరిలోకి దిగుతానని వెల్లడించాడు. ఈ నెల 25 నుంచి జరగనున్న ఏసీఏ సెలక్షన్స్ టోర్నీలో ఆడనున్నట్లు అతను చెప్పాడు. ‘నేను పుట్టింది కాకినాడలోనే. కుటుంబ కారణాలతో మేమంతా అక్కడికి వెళ్లిపోతున్నాం. ఇలాంటి సమయంలో జట్టు మారడం కూడా తప్పనిసరి అనిపించింది. అందుకే హైదరాబాద్‌ను వదలాలని నిర్ణయించుకున్నా. అక్కడ కూడా మెరుగ్గా రాణిస్తాననే నమ్మకం ఉంది’ అని విహారి అన్నాడు.

క్రికెట్‌లో ప్రాధమిక శిక్షణ నుంచి రంజీ జట్టు కెప్టెన్‌గా ఎదిగే వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తనకు ఎన్నో అవకాశాలిచ్చిందని, హెచ్‌సీతో విభేదాల కారణంగా జట్టు మారుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అతను స్పష్టం చేశాడు. హెచ్‌సీఏ కార్యదర్శి జాన్ మనోజ్‌తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను పేర్కొన్నాడు.  హైదరాబాద్, సౌత్‌జోన్ జట్ల తరఫున కలిపి ఆరు సీజన్లలో 40 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన విహారి 55.74 సగటుతో 3066 పరుగులు చేశాడు. 30 వన్డేల్లో 955 పరుగులు చేసిన అతను.. 52 టి20ల్లో 106.93 స్ట్రైక్‌రేట్‌తో 925 పరుగులు సాధించాడు.

మరిన్ని వార్తలు