‘స్వింగ్‌ కాకపోతే టీమిండియాతో కష్టమే’

21 Jul, 2018 14:01 IST|Sakshi

లీడ్స్‌ : ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బంతి స్వింగ్‌ కాకపోతే టీమిండియాను ఓడించడం కష్టమేనని ఇంగ్లండ్‌ మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో వేడి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండడంతో బంతి స్వింగ్‌ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో గ్రేమ్‌ స్వాన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''బంతి కనుక స్వింగ్‌ కాకపోతే, ఇంగ్లండ్‌ రివర్స్‌ స్వింగ్‌ మీద ఆధారపడాల్సి ఉంటుంది. రివర్స్‌ స్వింగ్‌ అయ్యే సమయానికి అండర్సన్‌ బౌలింగ్‌లో వేడి తగ్గవచ్చు.

ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన సిరీస్‌లో బంతి ఆరంభం నుంచే స్వింగ్‌ కావడంతో అండర్సన్‌ విజృంభించాడు. బంతి స్వింగ్‌ అవుతున్నప్పుడు అండర్సన్‌ను ఎదుర్కోకూడదనే ప్రపంచంలో ప్రతి బ్యాట్స్‌మెన్‌ కోరుకుంటాడు. రాబోయే టెస్టు సిరీస్‌లో బంతి స్వింగ్‌ అయితే ఇంగ్లండ్‌ సులభంగా గెలుస్తుంది. ఒకవేళ స్వింగ్‌ కాకపోతే ఫలితం వేరేలా ఉండొచ్చు. ఇలా భారత్‌ సిరీస్‌లో పుంజుకునే అవకాశాలున్నాయి. నా వరకూ అయితే స్వింగ్‌ ఉండదనే అనుకుంటున్నా’’ అని స్వాన్‌ తెలిపాడు.  భారత్-ఇంగ్లండ్ మద్య బర్మింగ్ హామ్ వేదికగా ఆగస్టు 1న తొలి టెస్టు ఆరంభం కానుంది.

మరిన్ని వార్తలు