హలెప్‌ సంచలనం

13 Jul, 2019 20:17 IST|Sakshi

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌ స్లామ్‌లో కొత్త చాంపియన్‌ అవతరించారు.  శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో రొమేనియా క్రీడాకారిణి, ఏడో సీడ్‌ సిమోనా హలెప్‌ విజయం సాధించారు. హలెప్‌ 6-2, 6-2 తేడాతో నల్లకలువ సెరెనా విలియమ్స్‌పై ఏకపక్ష విజయం సాధించి తొలిసారి వింబుల్డన్‌ ట్రోఫీని ముద్దాడారు. మరొకవైపు రొమేనియా తరఫున తొలి వింబుల్డన్‌ సింగిల్స్‌ టైటిల్‌ సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. తొలి సెట్‌ను అవలీలగా గెలుచుకున్న హలెప్‌.. రెండో సెట్‌లో కూడా అదే జోరును కొనసాగించారు.

ఏ దశలోనూ సెరెనాకు అవకాశం ఇవ్వకుండా ఆద్యంతం దూకుడును ప్రదర్శించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.  ఇది హలెప్‌కు  రెండో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌. గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను గెలిచిన హలెప్‌..  ఇప్పుడు తాజాగా వింబుల్డన్‌లో విజేతగా నిలిచారు.దాంతో  అత్యధిక గ్రాండ్‌ స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన మార్గరెట్‌(24 టైటిల్స్‌) రికార్డును సమం చేద్దామనుకున్న సెరెనా ఆశలు తీరలేదు. వరుస రెండు సెట్లలో దారుణంగా విఫలమైన సెరెనా విలియమ్స్‌ రన్నరప్‌గా సరిపెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు