ఇక కౌంటీ క్రికెట్‌లో...

19 Mar, 2020 03:52 IST|Sakshi

ఒప్పందం దాదాపుగా ఖరారు 

భారత క్రికెటర్‌ హనుమ విహారి వెల్లడి 

జట్టును గెలిపించేదే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ అన్న ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌

కరోనా నేపథ్యంలో భారత క్రికెటర్లంతా చాలా వరకు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే టెస్టు జట్టు సభ్యుడు, ఆంధ్ర కెప్టెన్‌ గాదె హనుమ విహారి మాత్రం తన ఆటకు మరింత పదును పెట్టుకునే పనిలో పడ్డాడు. తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ (టీఎన్‌సీఏ) నిర్వహిస్తున్న రాజా ఆఫ్‌ పాలయంపట్టి (ఫస్ట్‌ డివిజన్‌) టోర్నీలో అతను పాల్గొన్నాడు. తాను ఉద్యోగిగా పని చేస్తున్న నెల్సన్‌ ఎస్‌సీ జట్టుకు అతను ప్రాతినిధ్యం వహించాడు. బుధవారం చెన్నైలో ఆళ్వార్‌పేట్‌ సీసీతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన విహారి 285 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్సర్లతో 202 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విపత్కర స్థితిలోనూ క్రికెట్‌పై అతనికి ఉన్న నిబద్ధతను ఇది చూపిస్తోంది. ఇక ముందూ దీనినే కొనసాగించాలని విహారి భావిస్తున్నాడు.  

హైదరాబాద్‌: భారత క్రికెటర్లు కౌంటీల్లో ఆడటం దశాబ్దాలుగా సాగుతోంది. నాటి సునీల్‌ గావస్కర్‌నుంచి నేటి విరాట్‌ కోహ్లి వరకు చాలా మంది ఏదో ఒక సందర్భంలో కౌంటీ క్రికెట్‌ ఆడినవారే. ఇంగ్లండ్‌లోని ప్రతికూల పరిస్థితుల్లో ఆడి తమ ఆటను తీర్చి దిద్దుకోవాలనుకునే ప్రయత్నం కొందరిదైతే... భారత జట్టుకు మ్యాచ్‌లు లేని ఆఫ్‌ సీజన్‌ వేసవిలో (ఐపీఎల్‌కు ముందు రోజుల్లో) కౌంటీల్లో మరికొందరు బిజీగా కనిపించేవారు. ఇప్పుడు ఈ జాబితాలో భారత టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర జట్టు కెప్టెన్‌ హనుమ విహారి చేరుతున్నాడు. కౌంటీల్లో ఆడేందుకు అతను ఇప్పటికే ఒక జట్టుతో దాదాపుగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

అయితే కరోనా వైరస్‌ కారణంగా అతను ఇంగ్లండ్‌ వెళ్లడం ఆలస్యమైంది. ‘ఈ సీజన్‌లో నేను నాలుగు కౌంటీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒక జట్టుతో ఒప్పందం దాదాపుగా ఖరారైంది. ఏ జట్టుకు ఆడబోతున్నానో పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా. ప్రస్తుతం కరోనా కారణంగానే అన్ని నిలిపివేయాల్సి వచ్చింది. పరిస్థితులు మెరుగు పడిన తర్వాత నేను ఆడగలనని నమ్ముతున్నా. కౌంటీల్లో ఆడటం నాకు ఎంతో నేర్చుకునే అవకాశం ఇస్తుంది’ అని విహారి అన్నాడు. తమిళనాడు లీగ్‌లో ఆడటం ద్వారా తన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కొనసాగించినట్లు అతను చెప్పాడు. 

9 టెస్టుల కెరీర్‌లో ఒక మ్యాచ్‌ మినహా (వైజాగ్‌లో దక్షిణాఫ్రికాపై) అతను 8 టెస్టులు విదేశాల్లోనే ఆడాడు. ‘నా బ్యాటింగ్‌పై నాకు విశ్వాసముంది. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా విదేశాల్లో రాణించే టెక్నిక్‌ నాకు ఉందని నమ్ముతోంది. అందుకే ఈ అవకాశాలు వచ్చాయి. ఇంగ్లండ్‌ అయినా, న్యూజిలాండ్‌ లేదా వెస్టిండీస్‌ అయినా పరిస్థితులకు అనుగుణంగా మన ఆటను మార్చుకోవడం ముఖ్యం. జట్టు నాకు ఎలాంటి బాధ్యత అప్పగించినా నెరవేర్చగలనని ఆత్మవిశ్వాసం నాకుంది’ అని ఈ ఆంధ్ర క్రికెటర్‌ వ్యాఖ్యానించాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండో టెస్టులో విహారి చక్కటి ప్రదర్శన కనబర్చాడు. హాగ్లీ ఓవల్‌ మైదానంలో బౌలింగ్‌కు బాగా అనుకూలించిన పిచ్‌పై 70 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. అయితే ఇది తన అత్యుత్తమ ప్రదర్శనగా భావించడం లేదని విహారి విశ్లేషించాడు. 

 ‘దీనిని నేను గొప్పగా చూడటం లేదు. నేను బాగానే ఆడాననేది వాస్తవం. అయితే అది జట్టును గెలిపించలేకపోయింది. కఠిన పరిస్థితుల్లో పరుగులు సాధించడం మంచిదే కానీ జట్టుకు విజయం లభించినప్పుడే దాని విలువ పెరుగుతుంది’ అని విహారి అభిప్రాయ పడ్డాడు. ఈ సీజన్‌ చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో మొత్తం తొమ్మిది టెస్టులు ఆడబోతోంది. ‘సొంతగడ్డపై కూడా నాకు మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం రావడం ఖాయం. సాధన చేయడం, ఎలాంటి అవకాశాన్నైనా అందుకునేందుకు సిద్ధంగా ఉండటమే నా పని’ అని హనుమ స్పష్టం చేశాడు. కరోనా విరామంతో ఇకపై ఇంటికే పరిమితం అవుతుండటంతో భారత జట్టు స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ నిక్‌ వెబ్‌ ఇచ్చిన వ్యక్తిగత ట్రైనింగ్‌ చార్ట్‌ను పాటించి ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటానని అతను వెల్లడించాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా