నువ్వు రాంచీ టెస్టులో ఆడొచ్చు కదా!

17 Oct, 2019 11:00 IST|Sakshi
హర్భజన్‌ సింగ్‌(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ ఫీల్డింగ్‌ దిగ్గజం జాంటీ రోడ్స్‌ను మళ్లీ క్రికెట్‌ ఆడొచ్చు కదా అంటూ టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కోరాడు. అదేంటి ఎప్పుడో రిటైర్‌ అయిన జాంటీని మళ్లీ క్రికెట్‌ ఆడమని కోరడం ఏంటా అనుకుంటున్నారా.. అందుకు జాంటీ రోడ్స్‌ మళ్లీ సఫారీ జెర్సీలో కనిపించడమే. సఫారీ జెర్సీ ధరించి రోడ్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఇందుకు ఒక క్యాప్టన్‌ కూడా జత చేశాడు.  ‘గ్రీన్‌ అండ్‌ గోల్డ్‌ జెర్సీని వేసుకోవడం గొప్ప అనుభూతిని తీసుకొచ్చింది. ఇది కేవలం ఫొటోషూట్‌ కోసం మాత్రమే. ముంబైలోని మెహబూబ్‌ స్టూడియోలో ఇలా ఫోజిచ్చా’ అని పోస్ట్‌ చేశాడు. దీనిపై వెంటనే స్పందించాడు భజ్జీ. ‘ జాంటీ...ఇప్పుడు మీ దక్షిణాఫ్రికా జట్టుకు బ్యాటింగ్‌ అవసరం ఉంది. నువ్వు మళ్లీ బరిలోకి దిగొచ్చుకదా. భారత్‌తో రాంచీలో జరుగనున్న చివరి టెస్టులో ఆడొచ్చు కదా’ అని హర్భజన్‌ సింగ్‌ సరదాగా చమత్కరించాడు.

ఇప్పటికే భారత జట్టు టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోంది. వరుస రెండు టెస్టుల్లో గెలిచి సిరీస్‌ను ఇంకా టెస్టు మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. విశాఖపట్టణం, పుణేల్లో జరిగిన టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా తిరుగులేని విజయాల్ని ఖాతాలో వేసుకుంది. దాంతో టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లలో రెండొందల పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చివరి టెస్టును భారత్‌ గెలిస్తే 240 పాయింట్లు సాధిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) టెస్టు చాంపియన్‌షిప్‌ ఆరంభించిన తర్వాత భారత్‌ జట్టు.. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ సాధించింది. దాంతో 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఇది మూడు టెస్టుల సిరీస్‌ కావడంతో రెండు టెస్టుల్లో విజయాల ద్వారా 80 పాయింట్లను సాధించింది.

మరిన్ని వార్తలు