మా ఫీల్డింగ్‌ బాగా మెరుగుపడాలి : హర్మన్‌ ప్రీత్‌

21 Mar, 2018 20:15 IST|Sakshi
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

సాక్షి, స్పోర్ట్స్‌ : ఫీల్డింగ్‌ తప్పిదం వల్లనే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురికావాల్సి వచ్చిందని టీమిండియా మహిళా క్రికెట్‌ టీ20 కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ అభిప్రాయపడ్డారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల ముక్కోణపు టీ20 టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ గురువారం నుంచి ప్రారంభంకానుంది.

ఈ సందర్భంగా హర్మన్‌ ప్రీత్‌ మీడియాతో మాట్లాడారు.  టీ20ల్లో అంతగా అనుభవం లేని భారత మహిళల జట్టు ఈ టోర్నీ ద్వారా బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను ఢీకొట్ట బోతుందన్నారు. బీగ్‌బాష్‌ లీగ్‌తో వారంతా టీ20ల్లో రాటుదేలారని, అయినప్పటికి భారత మహిళలం సాయశక్తులు పోరాడుతామని తెలిపారు. ప్రస్తుతం తమ జట్టు నేర్చుకునే దశలో ఉందని, టీ20 ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా ఈ టోర్నీ ఎంతో ఉపయోగపడనుందని హర్మన్‌ప్రీత్‌ చెప్పుకొచ్చారు.

వారితో పోలిస్తే మా బలం చాలా తక్కువనే విషయం తమకి తెలుసన్నారు. తమ ఫీల్డింగ్‌ మెరుగుపడాల్సిన అవసరమెంతో ఉందని, వన్డే సిరీస్‌లో జరిగిన తప్పిదాలను సరిచేకుంటామన్నారు. దక్షిణాఫ్రికా పర్యటన విజయానంతరం భారత మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని , అదే ఉత్సాహంతో ఈ సిరీస్‌ను గెలుస్తామని హర్మన్‌ ప్రీత్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇక మహిళల క్రికెట్‌ పట్ల ఆదరణ పెంచేందుకు బీసీసీఐ ఈ టోర్నీ మ్యాచ్‌లను ప్రేక్షకులు ఉచితంగా వీక్షించే సౌకర్యం కల్పించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు