ఆసీస్‌ అదుర్స్‌...

8 Dec, 2018 00:58 IST|Sakshi

ఆస్ట్రేలియా హాకీ జట్టు వరుసగా మూడోసారి ప్రపంచకప్‌ను సాధించేందుకు అజేయంగా దూసుకెళుతోంది. పూల్‌ ‘బి’లో శుక్రవారం జరిగిన పోరులో కంగారూ జట్టు 11–0తో చైనాపై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్ని గెలిచి లీగ్‌ దశను ముగించింది. ఆట మొదలైన పది నిమిషాలకే ఆసీస్‌ ధాటికి చైనా చేతులెత్తేసింది. బ్లేక్‌ గోవర్స్‌ (10వ, 19వ, 34వ ని.) హ్యాట్రిక్‌ గోల్స్‌తో చెలరేగాడు. టిమ్‌ బ్రాండ్‌ (33వ, 55వ ని.) రెండు గోల్స్‌ చేయగా, జలెస్కీ (15వ ని.), క్రెయిగ్‌ (16వ ని.), హేవర్డ్‌ (22వ ని.), వెటన్‌ (29వ ని.), వొదెర్‌స్పూన్‌ (38వ ని.), ఫ్లిన్‌ ఒగిలివ్‌ (49వ ని.) తలా ఒక గోల్‌ చేశారు.

ఆసీస్‌కు మెగా టోర్నీలో ఏకపక్ష విజయం కొత్తేం కాదు. 2010 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా 12–0తో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. మరోవైపు ఈ పూల్‌ నుంచి చిత్రంగా చైనాను అదృష్టం ముందుకునెట్టింది. ఆసీస్‌తో ఘోరంగా ఓడినా కూడా చైనా క్వార్టర్స్‌ దారిలో క్రాస్‌ ఓవర్‌ నాకౌట్‌ మ్యాచ్‌కు అర్హత సాధించింది. ఇదే పూల్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఐర్లాండ్‌ 2–3తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ రెండు జట్లతో డ్రా చేసుకోవడంతో చైనా పూల్‌ నుంచి మూడో జట్టుగా నాకౌట్‌కు అర్హత పొందింది. 10న జరిగే క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్‌తో చైనా, న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌ తలపడతాయి.   
 

మరిన్ని వార్తలు