‘అదే మయాంక్‌కు అసలు పరీక్ష’

19 Nov, 2019 13:39 IST|Sakshi

న్యూఢిల్లీ: టెస్టు ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన ఏడాది వ్యవధిలోనే టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ జట్టులో ప్రత్యేక ముద్ర వేశాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై డబుల్‌ సెంచరీలు సాధించి ఓపెనర్‌ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కూడా తన కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకను సాధించాడు. ఇటీవల విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో మయాంక్‌ 11వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా మయాంక్‌ నిలవడమే కాకుండా, బంగ్లాదేశ్‌తో టెస్టులో 243 పరుగులు చేసి కెరీర్‌ బెస్ట్‌ స్కోరు సాధించాడు.

కాగా, మయాంక్‌కు అసలైన నిజమైన పరీక్ష భవిష్యత్తులో ఎదురవడం ఖాయమని అంటున్నాడు దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌. ఇది కేవలం మయాంక్‌కు తొలి ఏడాది మాత్రమేనని, రెండో ఏడాది అతని బలాన్ని అంచనా వేయడంలో ప్రత్యర్థి దృష్టి సారిసాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఈ క్రమంలోనే అతనికి మున‍్ముందు నిజమైన సవాల్‌ ఎదురవడం ఖాయమన్నాడు. ‘ మయాంక్‌ టెస్టు క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాడు. ఇది అతనికి మొదటి సంవత్సరం మాత్రమే. రెండో ఏడాది కూడా అతను ఇదే తరహా స్కోర్లు చేయాలని ఆశిస్తున్నా. అయితే అతని బ్యాటింగ్‌కు సంబంధించిన ఎక్కువ డేటా ప్రత్యర్థి జట్లకు అందుబాటులో ఉంటుంది. దాంతో మయాంక్‌పై సీరియస్‌గా దృష్టి పెడతారు. మయాంక్‌ ఫ్రంట్‌, బ్యాక్‌ ఫుట్‌ వర్క్‌ అమోఘంగా ఉంది. కాకపోతే ఆఫ్‌ సైడ్‌ షాట్లు కొట్టేటప్పుడు అతని బ్యాటింగ్‌ టెక్నిక్‌లో ఇబ్బంది కనబడుతుంది. ఆఫ్‌ సైడ్‌ షాట్లను కూడా ఏ మాత్రం వంగకుండా నేరుగా కొడుతున్నాడు’ అని గావస్కర్‌ విశ్లేషించాడు.

మరిన్ని వార్తలు