‘మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అంపైర్‌కివ్వాలి’

23 Apr, 2018 16:52 IST|Sakshi
అంపైర్‌ వినీత్‌ కులకర్ణి (ఫైల్‌ ఫొటో)

సన్‌రైజర్స్‌ అభిమానులు ఆగ్రహం​

సాక్షి, హైదరాబాద్‌ : చెన్నైసూపర్‌ కింగ్స్‌తో ఓటమిని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ కడదాక పోరాడి నాలుగు పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి ఫీల్డ్‌ అంపైర్‌ వినీత్‌ కులకర్ణినినే కారణమని అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం సన్‌ ఇన్నింగ్స్‌లో శార్థుల్‌ ఠాకుర్‌ వేసిన 17 ఓవర్‌ రెండో బంతి.

అసలేమైందంటే.. 17 ఓవర్‌ రెండో బంతిని ఠాకుర్‌ విలియమ్సన్‌ చాతిపైకి ఫుల్‌ టాస్‌ వేసాడు. అయితే అంపైర్‌ నోబాల్‌ ఇవ్వలేదు. దీనికి వెంటనే విలియమ్సన్‌ అంపైర్‌ను ప్రశ్నిస్తూ.. మైదానంలో అసహనం వ్యక్తం చేశాడు. అది నోబాల్‌ అని టీవీ రిప్లేలో సైతం స్పష్టం అయింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆ బంతిని నోబాల్‌ ఇచ్చి ఉంటే.. ఒక్కపరుగు అదనంగా రావడమే కాకుండా మరో బంతితో ఫ్రీహిట్‌ అవకాశం వచ్చేది. ఇదే జరిగితే మ్యాచ్‌ ఫలితంలో తేడా ఉండేది. ఇప్పడు ఇదే సన్‌ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో ఈ అంపైర్‌పై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.

అంపైర్‌ చెన్నై 12వ ఆటగాడు..
‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అంపైర్‌కే ఇవ్వాలి’.. అని కొందరంటే.. ‘ఫీల్డ్‌ అంపైర్లు ఎందుకు టీవీ అంపైర్‌ సమీక్షను కోరలేదు.. చిన్న విషయాలే.. మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపుతాయని తెలియదా’ అని ఇంకొందరు నిలదీస్తున్నారు. ఇక అంపైర్‌ వినీత్‌ కులకర్ణి మైదానంలోని చెన్నై 12వ ఆటగాడని ఇంకొందరు ఎద్దేవా చేస్తున్నారు. ‘అంపైర్‌ స్కిల్స్‌ లేని నీవు ఇతరులను ఎందుకు ఇబ్బందిపెడ్తున్నావని’ కొందరు మండిపడుతున్నారు. ఏదేమైనా అంపైర్‌ తప్పిదంతోనే తమ జట్టు ఓడిందని సన్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో విలియమ్సన్‌ (84), యూసఫ్‌ పఠాన్‌(45) పోరాడిన ఫలితం దక్కలేదు. సన్‌రైజర్స్‌ విజయానికి ఆఖరి బంతికి సిక్సు సాధించాల్సి ఉండగా.. రషీద్‌ఖాన్‌ సింగిల్‌ తీయడంతో నాలుగు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 

మరిన్ని వార్తలు