యెడ్డీకి షాక్‌: కొడుకు, సన్నిహితురాలికి నో!

23 Apr, 2018 16:53 IST|Sakshi

సాక్షి, మైసూర్‌ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేపిన నియోజకవర్గం వరుణ.. ఇక్కడి నుంచి సీఎం సిద్దరామయ్య, ప్రతిపక్ష నేత బీఎస్‌ యడ్యూరప్ప తనయులు బరిలోకి దిగుతారని మొదట భావించారు. ఊహించినట్టుగానే సిద్దరామయ్య కొడుకు డాక్టర్‌ యతీంద్రను ఇక్కడి నుంచి బరిలోకి దిగగా.. యడ్యూరప్ప తనయుడికి మాత్రం​మొండిచేయి దక్కినట్టు కనిపిస్తోంది. దీంతో ఈ నియోజకవర్గంలో సీఎం, ప్రతిపక్ష నాయకుడి తనయుల మధ్య పోరు తప్పినట్టయింది.

అసంతృప్తి లేదు..!
బీజేపీ విడుదల చేసిన నాలుగో జాబితాలో తన కొడుకుకు సీటు దక్కకపోవడంపై అసంతృప్తి లేదని కర్ణాటక కమల సారథి యడ్యూరప్ప తెలిపారు. తన కొడుకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. వరుణ నియోజకవర్గంలో తన కొడుకును బరిలోకి దింపవద్దని తానే నిర్ణయం తీసుకున్నానని, చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలియజేశామని ఆయన తెలిపారు. తండ్రీ-కొడుకుల పోటీకి బీజేపీ అధినాయకత్వం వ్యతిరేకంగా ఉందా? అని మీడియా ప్రశ్నించగా.. అదేమీ లేదని, చాలాచోట్ల తండ్రీ-కొడుకులిద్దరూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆయన తెలిపారు.

మొత్తానికి బీజేపీ నాలుగో జాబితా యెడ్డీకి తీవ్ర నిరాశే మిగిల్చిందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. యెడ్డీ తనయుడితోపాటు ఆయనకు సన్నిహితురాలైన శోభా కర్లందాజే పేరు కూడా ఈ నాలుగో జాబితాలో లేదు. దీంతో యెడ్డీ అనుచరులు కొంతమందికి ప్రాధాన్యం దక్కనట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు విడుదల చేసిన నాలుగు జాబితాల్లో.. మొత్తం 219 మంది అభ్యర్థులను బీజేపీ అధినాయకత్వం ఖరారు చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 12న ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు