హైదరాబాద్‌ బోణీ

29 Sep, 2019 03:23 IST|Sakshi

122 పరుగుల తేడాతో సౌరాష్ట్రపై ఘన విజయం

విజయ్‌ హజారే ట్రోఫీ

ఆలూరు (బెంగళూరు): దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ బోణీ కొట్టింది. శనివారం సౌరాష్ట్రతో  మ్యాచ్‌లో 122 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత హైదరాబాద్‌ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (98 బంతుల్లో 75; 5 ఫోర్లు, సిక్స్‌), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ తిలక్‌ వర్మ (74 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. సారథి అంబటి రాయుడు (17) నిరాశపరిచాడు. చివర్లో బవనక సందీప్‌ (38; 2 ఫోర్లు, సిక్స్‌) దూకుడుతో జట్టు 250 పరుగుల మార్కు దాటింది. అనంతరం సందీప్‌ బౌలింగ్‌తో సౌరాష్ట్రను కుప్పకూల్చాడు. 9.1 ఓవర్లు వేసిన అతడు 26 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. దీంతో సౌరాష్ట్ర 39.1 ఓవర్లలో 131 పరుగులకు పరిమితమైంది.   

కేఎల్‌ రాహుల్‌భారీ శతకం
బెంగళూరు వేదికగా కేరళతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ భారీ శతకం (122 బంతుల్లో 133; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కదంతొక్కాడు. మొదట కర్ణాటక రాహుల్, మనీశ్‌ పాండే (50) రాణించడంతో 49.5 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది. కేరళ 46.4 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ విష్ణు వినోద్‌ (104), సంజూ శామ్సన్‌ (67) మినహా మరెవరూ నిలవకపోవడంతో 123 పరుగుల తేడాతో ఓడింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబైపై చత్తీస్‌గఢ్‌ 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలుత ముంబై 50 ఓవర్లలో 317 పరుగులు చేయగా... చత్తీస్‌గఢ్‌  బంతి మిగిలి ఉండగానే 318 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు