ఆ విషయం నాకు తెలుసు: కోహ్లి

12 Dec, 2019 11:59 IST|Sakshi

ముంబై: వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా గెలవడంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముఖ్య పాత్ర పోషించాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(71), కేఎల్‌ రాహుల్‌(91)లు మంచి ఆరంభాన్ని ఇవ్వడంతో సెకండ్‌ డౌన్‌లో వచ్చిన కోహ్లి పరుగుల మోత మోగించడంపైనే దృష్టి పెట్టాడు. సాధ్యమైనంత భారీ స్కోరునే విండీస్‌ ముందుంచాలనే లక్ష్యంతో కోహ్లి చెలరేగిపోయాడు. దాంతో 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 70 పరుగులు సాధించాడు. మ్యాచ్‌ తర్వాత తన ఇన్నింగ్స్‌తో పాటు విజయం గురించి కోహ్లి మాట్లాడుతూ..ఇది తన బ్యాట్‌ నుంచి వచ్చిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ అని పేర్కొన్నాడు.

‘ఇదొక అత్యుత్తమ ఇన్నింగ్స్‌.  ఇది నాకు ఒక స్పెషల్‌ గిఫ్ట్‌.. స్పెషల్‌ మ్యాచ్‌. నేను ఆడిన మంచి ఇన్నింగ్స్‌ల్లో ఇది కూడా ఒకటి. మేము ముందుగా బ్యాటింగ్‌ చేయడం గెలవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా ఇన్నింగ్స్‌ గురించి చెప్పాలంటే నేను అన్ని ఫార్మాట్లలో ఆడగలననే విషయం మరోసారి రుజువైంది. నేను మూడు ఫార్మాట్లకు తగ్గట్టు ఆడతాననే విషయం నాకు తెలుసు. వరల్డ్‌కప్‌కు ముందు ఇదొక ప్రేరణగా నిలుస్తుంది. టీ20 మ్యాచ్‌లకు దూరం అవుతూ వస్తున్న తర్వాత ఇలా ఆడటం నిజంగానే సంతోషంగా ఉంది. రోహిత్‌, రాహుల్‌ మంచి పునాది వేశారు. అదే మ్యాచ్‌లో విజయానికి కీలకమైంది. తొలుత బ్యాటింగ్‌ చేయడం వల్ల పరిస్థితులు కఠినంగా ఉంటాయనే అనుకున్నాం. కానీ పిచ్‌ మాత్రం బ్యాటింగ్‌కు బాగా అనుకూలించింది. ఇది మాకు మంచి పాఠం. దీన్ని గుర్తించుకోవాలి. పిచ్‌ పరిస్థితిని అర్ధం చేసుకునే ఆడటాన్ని అలవాటు చేసుకోవాలి’ అని కోహ్లి తెలిపాడు.

వాంఖెడే మైదానంలో జరిగిన ఆఖరి టి20లో భారత్‌ 67 పరుగుల తేడాతో విండీస్‌పై గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీస్కోరు చేసింది. తర్వాత వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడింది. పొలార్డ్‌ (39 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) కాసేపు పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.

మరిన్ని వార్తలు