బాల్‌ ట్యాంపరింగ్‌ ఇలా చేసే వాడిని..!

25 May, 2019 12:03 IST|Sakshi

లండన్‌: తాను క్రికెట్‌ ఆడే సమయంలో బాల్‌ ట్యాంపరింగ్‌ చేసే వాడినంటూ ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ సంచలన విషయాలు వెల్లడించాడు. ఇందుకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు నుంచి పూర్తిగా మద్దతు ఉండేందంటూ కొత్త​ వివాదానికి తెరలేపాడు. 2006-13 మధ్య కాలంలో ఇంగ్లండ్‌ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన పనేసర్‌.. ట్యాంపరింగ్‌ చేయడానికి సన్‌ స్ర్కీన్‌ లోషన్స్‌తో పాటు తన ప్యాంటుకు ఉన్న జిప్‌ను ఉపయోగించే వాడినన్నాడు. కొన్ని సమయాల్లో చూయింగ్‌ మింట్‌లతో కూడా బంతి ఆకారాన్ని చెడగొట్టడానికి యత్నించేవాడినన్నాడు.

ఈ విషయాల్నితన రాసిన ‘ ద ఫుల్‌ మోంటీ’ పుస్తకం ద్వారా బయటపెట్టాడు. సాధ్యమైనంత వరకూ బంతిని పొడి బారేలే చేయడానికి ఈ విధానాల్ని ఉపయోగించే వాడినని, తాను బంతి ఆకారాన్ని ఎలా దెబ్బతీయాలనే విషయంలో పేసర్‌ జేమ్స్‌ అండర్‌సన్‌ సహకరించే వాడన్నాడు. ఇలా తాను చేసిన తర్వాత బంతి రివర్స్‌ స్వింగ్‌కు తోడ్పటమే ప్రధాన కారణంగా చెప్పుకొచ్చాడు. ఆపై అండర్సన్‌ తరహా పేసర్లకు బంతి నుంచి రివర్స్‌ స్వింగ్‌ లభించేదంటూ పనేసర్‌ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ తరఫున 50 టెస్టు మ్యాచ్‌లు ఆడిన పనేసర్‌ 167 వికెట్లు సాధించగా, 26 వన్డేలకు గాను 24 వికెట్లు మాత్రమే తీశాడు. క్రికెట్‌ లా మేకర్‌ ఎంసీసీ నిబంధనల ప్రకారం బంతి ఆకారాన్ని కావాలని దెబ్బ తీయడం నేరం. ఐసీసీ 42.3 నియమావళి ప్రకారం ఇలా ఎవరైనా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ తాజా వివాదంపై ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు