వన్డేల్లోనూ కోహ్లినే కింగ్‌

22 Jan, 2019 11:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  టీమిండియా యువ సంచలనం రిషబ్‌ పంత్‌ అరంగేట్ర ఏడాదే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గతేడాది టెస్టుల్లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన పంత్‌.. అటు కీపింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. దీంతో ‘ఐసీసీ టెస్టు టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్ 2018‌’లో పంత్‌ చోటు దక్కించుకున్నాడు. 2018లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ఐసీసీ టెస్టు జట్టులో చోటు కల్పించింది. దీనికి సంబంధించి ఐసీసీ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.  ఇక టెస్టు టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2018 జట్టుకు ఈ ఏడాది కూడా విరాట్‌ కోహ్లినే సారథిగా ఎంపికయ్యాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో మరో భారత ఆటగాడు జస్ప్రిత్‌ బుమ్రా చోటు దక్కించుకున్నాడు. కాగా టీమిండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ చటేశ్వర పుజారాకు అవకాశమివ్వకపోవడం గమనార్హం.

టెస్టు జట్టులో టామ్‌ లాథమ్‌, కేన్‌ విలియమ్సన్‌, హెన్రీ నికోలస్‌(న్యూజిలాండ్‌), కరుణరత్నే (శ్రీలంక), కగిసో రబడా(దక్షిణాఫ్రికా), నాథన్‌ లియోన్‌(ఆస్ట్రేలియా), జాసన్‌ హోల్డర్‌(వెస్టిండీస్‌), మహ్మద్‌ అబ్బాస్‌(పాకిస్తాన్‌)లు చోటు దక్కించుకున్నారు. అయితే ఇంగ్లండ్‌ టెస్టు సారథి జోయ్‌ రూట్‌తో పాటు మరే ఇతర బ్రిటీష్‌ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌ గెలవడంలో కోహ్లి, పంత్, బుమ్రా, పుజారా కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్న కోహ్లి.. ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు రాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పుజారా మూడో స్థానంలో కొనసాగుతుండగా.. ఆసీస్‌పై చివరి టెస్టుల్లో శతక్కొట్టిన పంత్‌ టాప్‌-20లో చోటు దక్కించుకున్నాడు. 

వన్డేల్లోనూ కోహ్లినే కింగ్‌
‘ఐసీసీ వన్డే టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2018’కు కూడా విరాట్‌ కోహ్లినే కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇక వన్డే జట్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌, స్టార్‌ బౌలర్ జస్ప్రిత్‌ బుమ్రాలు చోటు లభించింది. బెయిర్‌స్టో, జోయ్‌ రూట్‌, బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌(ఇంగ్లండ్‌), రాస్‌ టేలర్‌ (న్యూజిలాండ్‌), ముస్తఫిజుర్ రహ్మాన్‌‌(బంగ్లాదేశ్‌), రషీద్‌ ఖాన్‌ (ఆఫ్గనిస్తాన్‌)లు ఐసీసీ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.  
    

మరిన్ని వార్తలు