టాప్‌ టెన్‌లో విరాట్‌ కోహ్లి

12 Dec, 2019 19:00 IST|Sakshi

హైదరాబాద్‌: వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. కోహ్లికి రోహిత్‌, రాహుల్‌లు జత కలవడంతో పాటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో టీమిండియా 67 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్‌లో అదరగొట్టిన కోహ్లి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ ను గెలుచుకున్నాడు. అంతేకాకుండా తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. ఇప్పటికే ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న కింగ్‌ కోహ్లి తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌లో ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని పదో స్థానానికి చేరుకున్నాడు. దీంతో మూడు ఫార్మట్లలో టాప్‌-10లో చోటు దక్కించుకున్న కోహ్లి ఈ ఏడాదిని ఘనంగా ముగించనున్నాడు. 

అంతేకాకుండా ఈ ఏడాది మూడు ఫార్మట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించడంతో పాటు 50కి పైగా సగటు నమోదు చేసిన ఏకైక క్రికెటర్‌గా కోహ్లి మరో ఘనతను అందుకున్నాడు. ఇక తొలి, చివరి టీ20ల్లో రాణించిన భారత ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి ఎగబాకాడు. మరో ఓపెనర్‌, టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ మాత్రం ఒక స్థానానికి దిగజారాడు. ముంబై మ్యాచ్‌లో మినహా తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమవ్వడంతో ర్యాంకింగ్స్‌లో ఎనిమిది నుంచి నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజమ్‌ కొనసాగుతున్నాడు. కాగా, ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో  ఏ ఒక్క భారత బౌలర్‌ కూడా టాప్‌-10లో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు