ఐసీసీ ట్రోల్‌.. సచిన్‌ దిమ్మతిరిగే పంచ్‌

16 May, 2019 17:22 IST|Sakshi

హైదరాబాద్‌: భారత క్రికెట్‌లో అతడో సంచలనం. క్రికెట్ దేవుడిగా పిలిపించుకున్న ఘనత అతని సొంతం. ఎంతో మంది క్రికెటర్లకు అతని జీవితమే ఓ పాఠ్యాంశం. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు. అన్నింటికీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన ఏకైక ఆటగాడు. ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రికార్డుల వేటగాడు. ఆయనే భారత క్రికెట్ లెజెండ్‌ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. రెండు దశాబ్దాల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి 2013లో రిటైర్ అయిన సచిన్.. ఆ తర్వాత ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు మద్దతుగా నిలుస్తున్నాడు.

అయితే అంపైర్ల తప్పిద నిర్ణయాలకు ఎక్కువగా బలైంది సచినేనని చెప్పడంలో అతిశయోక్తిలేదు. అంపైర్ తప్పుడు నిర్ణయాల వల్ల 99 పరుగుల వద్ద ఎన్నో సార్లు ఔట్ అయ్యి అసహనంతో వెనుదిరిగాడు. అయితే, సచిన్ రిటైర్ అయ్యాక కూడా అతడిని అంపైర్‌ వదలడం లేదు. ముంబైలోని టెండూల్కర్-మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీ క్యాంప్‌లో సచిన్, కాంబ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయని, తామిద్దరం ఎప్పుడూ ప్రత్యర్థులుగా ఆడలేదని తెలిపారు. దానికి తగ్గట్లు కాంబ్లీకి సచిన్ లెగ్ స్పిన్ బౌలింగ్ వేసిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అయితే, క్రీజు దాటి వేసిన దృష్యాన్ని పసిగట్టిన ఐసీసీ.. ‘మీ ఫ్రంట్ ఫుట్ చూసుకోండి.. అది నో బాల్’ అంటూ సచిన్‌ను ట్రోల్‌ చేసింది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
సచిన్, కాంబ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్‌

అయితే ఐసీసీ ట్వీట్‌కు సచిన్‌ చాలా తెలివిగా బదులిచ్చాడు. ‘హమ్మయ్య కనీసం ఈ సారి నేను బౌలింగ్ వేశా. బ్యాటింగ్ అయితే చేయలేదు. ఏదేమైనా అంపైర్ నిర్ణయమే ఫైనల్’ అని ఐసీసీకి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. సచిన్‌ చేసిన ట్వీట్‌కు క్షణాల్లోనే వేలాది లైకులు, రీట్వీట్లు వచ్చాయి. సచిన్‌కు మద్దతుగా నెటిజన్లు కూడా ఐసీసీని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇక తాజా ఐపీఎల్‌లోనూ అంపైర్ల తప్పిదాలు ఎక్కువై విమర్శలపాలైన విషయం తెలిసిందే.


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా