నా శరీరం అనుకూలిస్తే..

27 May, 2019 14:11 IST|Sakshi

లండన్‌: ఫిట్‌నెస్‌ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోతే వరల్డ్‌కప్‌ తర్వాత కూడా క్రికెట్‌లో కొనసాగుతానని న్యూజిలాండ్‌ సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ స్పష్టం చేశాడు. తాను సుదీర్ఘ కాలంగా క్రికెట్‌ ఆడటానికి వెస్టిండీస్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ కూడా ఒక స్ఫూర్తి అని టేలర్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను 35 ఒడిలో ఉన్నందున ఇంకా క్రికె‌ట్‌లో​ కొనసాగాలనే అనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే తర్వాత జరిగే పరిణామాల్ని బట్టి క్రికెట్‌ ఆడేది.. లేనిది తెలుస్తుందన్నాడు. శరీరం అనుకూలిస్తే వరల్డ్‌కప్‌ తర్వాత క్రికెట్‌ను యథావిధిగా కొనసాగిస్తానన్నాడు.

‘ గేల్‌కు 39 ఏళ్లు. 2023 నాటికి వరల్డ్‌కప్‌కు నాకు 39 ఏళ్లు వస్తాయి. దాంతో ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ప్రస్తుత వరల్డ్‌కప్‌ చివరిది అని చెప్పలేను.  నా శరీరం అనుకూలిస్తే క్రికెట్‌లో కొనసాగుతా. కివీస్‌ వరల్డ్‌కప్‌ సాధించాలనేది నా కోరిక. అదే లక్ష్యంతో నా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. కాకపోతే దీన్ని మనసులో పెట్టుకుని మాత్రం ఆటకు సిద్ధం కాను. మెగా టోర్నీల్లో ఒత్తిడి అనేది సహజం. దాన్ని అధిగమిస్తేనే విజయాల్ని సాధించగలం’ అని టేలర్‌ పేర్కొన్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌ జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో టేలర్‌ 71 పరుగులు చేసి కివీస్‌ విజయానికి సహకరించాడు.

మరిన్ని వార్తలు