ఇక కోహ్లికి తలనొప్పి తప్పదు: రోహిత్‌

11 Nov, 2019 10:20 IST|Sakshi

నాగ్‌పూర్‌: భారత క్రికెట్‌ జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందు ఇప్పుడు సరికొత్త తలనొప్పి వచ్చి పడిందంటున్నాడు తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మ. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు విరాట్‌కు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో రోహిత్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఈ మూడు టీ20ల సిరీస్‌లో తొలి టీ20 కోల్పోయిన టీమిండియా.. ఆపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా, ఈ సిరీస్‌లో యువ క్రికెటర్లకు అవకాశం రావడంతో వారు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ప్రధానం శివమ్‌ దూబే, దీపక్‌ చహర్‌లు రాణించి సిరీస్‌ను చేజిక్కించుకోవడంలో ముఖ్య భూమిక పోషించాడు. మరొకవైపు శ్రేయస్‌ అయ్యర్‌ కూడా సత్తా చాటాడు. ప్రధానంగా భారత జట్టు ఎప్పుట్నుంచో అన్వేషిస్తున్న నాల్గో స్థానంపై ఆశలు రేకెత్తిస్తున్నాడు.

మరొకవైపు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్న రిషభ్‌ పంత్‌ నిరాశ పరుస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే కెప్టెన్‌ కోహ్లికి కొత్త తలనొప్పి తప్పదని రోహిత్‌ శర్మ అభిప్రాయపడ్డాడు. ఒకవైపు యువ క్రికెటర్లు కూడా రాణించడంతో అటు కోహ్లికి ఇటు సెలక్టర్లకు జట్టు ఎంపికలో ఇబ్బందులు తప్పవని పేర్కొన్నాడు. ‘ చివరి టీ20 గెలుపులో బౌలర్లే ముఖ్య పాత్ర పోషించారు. టీ20ల్లో మ్యాచ్‌ మధ్యలో బౌలర్లకు కచ్చితంగా సవాల్‌ ఎదరవుతుంది. (ఇక్కడ చదవండి: చహర్‌ సిక్సర్‌... భారత్‌ విన్నర్‌)

అయితే తమ యువ బౌలింగ్‌ యూనిట్‌ అమోఘంగా ఆకట్టుకోవడంతో మ్యాచ్‌ను సునాయాసంగా గెలిచాం. ఒక దశలో బంగ్లాదేశ్‌కు 8 ఓవర్లలో 70 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. అప్పుడు మా పరిస్థితి ప్రతికూలంగా మారిపోయింది. అటువంటి తరుణంలో బౌలర్లు తమ బాధ్యతను నెరవేర్చారు. దాంతో తిరిగి గాడిలో పడ్డాం. బ్యాటింగ్‌ విభాగంలో అయ్యర్‌, రాహుల్‌కు మంచి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఆరంభంలో రాహుల్‌ బాగా ఆడితే, స్కోరును పెంచడంలో అయ్యర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఇలా ప్రతీ ఒక్కరూ రాణించడం శుభ సూచకం. కాకపోతే జట్టు ఎంపిక అనేది సవాల్‌గా మారుతుంది. ఇది కోహ్లి, సెలక్టర్లకు తలపోటే(నవ్వుతూ)’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు