12 బంతుల్లోనే..

23 Oct, 2019 01:30 IST|Sakshi

మూడో టెస్టులో ఇన్నింగ్స్, 202 పరుగులతో భారత్‌ ఘన విజయం

3–0తో ‘ఫ్రీడం ట్రోఫీ’ సొంతం

రాంచీ: భారత క్రికెట్‌ జట్టు లాంఛనం పూర్తి చేసింది. దక్షిణాఫ్రికా మిగిలిన 2 వికెట్లను నాలుగో రోజు ఆరంభంలోనే పడగొట్టి ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలు 133 పరుగులకే ఆలౌటయ్యారు. మంగళవారం ఈ క్రతువుకు సరిగ్గా 2 ఓవర్లు మాత్రమే సరిపోయాయి. తొలి ఓవర్‌ వేసిన షమీ ఒక పరుగు ఇచ్చి ముగించాడు. ఆ తర్వాతి ఓవర్‌ వేసిన నదీమ్‌ తొలి నాలుగు బంతుల్లో పరుగులివ్వలేదు. చివరి రెండు బంతుల్లో వరుసగా బ్రూయిన్‌ (49 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్‌), ఇన్‌గిడి (0)లను అవుట్‌ చేయడంతో దక్షిణాఫ్రికా కథ కంచికి చేరింది. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌లు గెలిచి ‘ఫ్రీడం ట్రోఫీ’ని సొంతం చేసుకున్న భారత్‌... దక్షిణాఫ్రికాను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేయడం ఇదే తొలిసారి. ఈ టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించిన రోహిత్‌ శర్మ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవడంతో పాటు సిరీస్‌లో మొత్తం 529 పరుగులు చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డునూ సొంతం చేసుకున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా పరిస్థితి మాత్రం సిరీస్‌లో రానురానూ తీసికట్టుగా మారింది.

విశాఖపట్నంలో జరిగిన తొలి టెస్టులో ఐదో రోజు వరకు పోరాడిన టీమ్‌ పుణే టెస్టులో నాలుగో రోజు 67.2 ఓవర్ల పాటు ఆడి చివరి సెషన్‌ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లగలిగింది. ఈ టెస్టులో నాలుగో రోజు రెండు ఓవర్లకే ఆ జట్టు ఆట పరిమితమైంది. తాజా ప్రదర్శనతో భారత్‌ ఖాతాలో మరో 40 వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లు చేరాయి. ఈ పద్ధతి మొదలయ్యాక ఐదు టెస్టులు ఆడిన భారత్‌ ఐదింటిలోనూ గెలిచి అందుబాటులో మొత్తం 240 పాయింట్లను కూడా సొంతం చేసుకోవడం విశేషం. మిగతా అన్ని జట్లు కలిపి 19 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టెస్టులు ఆడగా... వారు సాధించి మొత్తం పాయింట్లు కలిపి 232 మాత్రమే కావడం టీమిండియా ఆధిపత్యాన్ని సూచిస్తోంది.

‘నిజాయితీగా శ్రమించాం...ఫలితాలు సాధించాం’
అద్భుతం. మేము ఎలా ఆడామో మీరంతా చూశారు. పెద్దగా అనుకూలించని పిచ్‌లపై కూడా ఇలాంటి ఫలితాలు రాబట్టడం గర్వంగా ఉంది. ప్రపంచంలో అత్యుత్తమ జట్టుగా నిలవాలంటే అన్ని రంగాల్లో పటిష్టంగా ఉండాలి. స్పిన్‌ మొదటినుంచి మన బలం కాగా, బ్యాటింగ్‌ అనేది ఎప్పుడూ సమస్యే కాదు. ఈ సారి పేస్‌ బౌలర్లు కూడా చెలరేగారు. మేం ఎక్కడైనా గెలవగలమని నమ్ముతున్నాం. నిజాయితీగా కష్టపడితే ఇలాంటి విజయాలు వాటంతట అవే వస్తాయి. పట్టుదలగా ఆడితే అన్నీ మనకు అనుకూలిస్తాయి. ఉత్కంఠ, తడబాటును అధిగమించి ఓపెనర్‌గా రాణించిన రోహిత్‌కు ప్రత్యేక ప్రశంసలు. ఏదైనా సాధించగలమనే నమ్మకమే మా జట్టును 31 విజయాల వరకు తీసుకొచ్చింది. దీంతో మేం ఆగిపోము.
–విరాట్‌ కోహ్లి, భారత జట్టు కెప్టెన్‌

ఐదు టెస్టు వేదికలుంటే చాలు...
క్రికెట్‌ను చిన్న నగరాలకు కూడా తీసుకొచ్చే క్రమంలో బీసీసీఐ పలు వేదికల్లో టెస్టులు నిర్వహిస్తోంది. అన్ని సంఘాలకు అవకాశం కల్పించాలనే బోర్డు రొటేషన్‌ పాలసీ కూడా అందుకు ఒక కారణం. అయితే కొన్ని ప్రధాన నగరాలు మినహా ఎక్కడా టెస్టులకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం లేదు. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌తో ఇది మళ్లీ రుజువైంది. మూడు చోట్లా స్టేడియంలో పెద్దగా జనం కనిపించలేదు. దీనిపై కెప్టెన్‌ కోహ్లి బోర్డుకు ఒక సూచన చేశాడు. భారత్‌లో టెస్టులను మాత్రం కొన్ని ప్రముఖ వేదికలకే పరిమితం చేయాలని అన్నాడు. ‘నా అభిప్రాయం ప్రకారం మన దేశంలో ఐదు టెస్టు వేదికలు మాత్రమే ఉంటే సరిపోతుంది. రొటేషన్, అందరికీ అవకాశం ఇవ్వాలనే విషయం నాకూ తెలుసు. కానీ వాటికి వన్డేలు, టి20 మ్యాచ్‌ల అవకాశం కల్పించాలి. మన వద్దకు వచ్చే ముందు విదేశీ జట్లకు కూడా ఎక్కడ టెస్టులు జరుగుతాయో తెలిసి వాటిని అనుగుణంగా సిద్ధమవుతాయి. అక్కడ పిచ్‌లు ఎలా ఉంటాయో, ప్రేక్షకుల సంఖ్య ఎంత ఉంటుందో అన్నీ తెలుస్తుంది. కాబట్టి ప్రేక్షకుల ఆదరణ బాగా ఉండే గరిష్టంగా ఐదు బలమైన టెస్టు వేదికలు చాలు’ అని విరాట్‌ అన్నాడు. భారత్‌లో ఇప్పటి వరకు 27 వేదికల్లో టెస్టు మ్యాచ్‌లు జరగ్గా... 2000 నుంచి 18 వేర్వేరు స్టేడియాల్లో జట్టు టెస్టులు ఆడింది.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 497/9 డిక్లేర్డ్‌;
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 162; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) ఉమేశ్‌ 5; ఎల్గర్‌ (రిటైర్డ్‌ హర్ట్‌) 16; హమ్జా (బి) షమీ 0; డు ప్లెసిస్‌ (ఎల్బీ) (బి) షమీ 4; బవుమా (సి) సాహా (బి) షమీ 0; క్లాసెన్‌ (ఎల్బీ) (బి) ఉమేశ్‌ 5; లిండే (రనౌట్‌) 27; పీట్‌ (బి) జడేజా 23; బ్రుయిన్‌ (సి) సాహా (బి) నదీమ్‌ 30; రబడ (సి) జడేజా (బి) అశ్విన్‌ 12; నోర్జే (నాటౌట్‌) 5; ఇన్‌గిడి (సి అండ్‌ బి) నదీమ్‌ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (48 ఓవర్లలో ఆలౌట్‌) 133 
వికెట్ల పతనం: 1–5, 2–10, 3–18, 4–22, 5–36, 6–67, 7–98, 8–121, 9–133, 10–133. 
బౌలింగ్‌: షమీ 10–6–10–3, ఉమేశ్‌ 9–1–35–2, జడేజా 13–5–36–1, నదీమ్‌ 6–1–18–2, అశ్విన్‌ 10–3–28–1.

మరిన్ని వార్తలు