న్యూజీలాండ్‌తో తలపడనున్న భారత్‌

17 Dec, 2019 21:01 IST|Sakshi

టోక్యో : 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు తమ మొదటి మ్యాచ్‌ను న్యూజీలాండ్‌, నెదర్లాండ్స్‌తో ఆడనున్నాయి. ఈ మేరకు ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఆడే షెడ్యూల్‌ను అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్‌(ఎఫ్‌ఐహెచ్‌) ప్రకటించింది. ఇందులో భాగంగా పురుషుల జట్టు గ్రూప్‌-ఏలో భాగంగా న్యూజీలాండ్‌తో(జూలై 25న), ఎనిమిది సార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియాతో (జూలై 26న), స్పెయిన్‌తో(జూలై 28న), డిపెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాతో(జూలై 30న), ఇక చివరి లీగ్‌ మ్యాచ్‌గా జపాన్‌తో జూలై 31 న తలపడనుంది.

మరోవైపు మహిళల జట్టు గ్రూప్‌-ఏ లో తమ మొదటి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో జూలై 25 న తలపడనుంది. తర్వాత వరుసగా జర్మనీ (జూలై 27న), బ్రిటన్‌(జూలై 29న), ఐర్లాండ్‌ (జూలై 31న), దక్షిణాఫ్రికా(ఆగస్టు 1న) ఆడనుంది. అయితే ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్‌ కోసం ఆగస్టు 6న పురుషుల జట్టు, ఆగస్టు 7న మహిళల జట్టు ఆడనున్నట్లు అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్‌ వెల్లడించింది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌కు భారత పురుషుల జట్టు అర్హత సాధించేందుకు భువనేశ్వర్‌లో ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో రష్యాను 11-3 తేడాతో చిత్తుగా ఓడించింది. మరోవైపు ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో మహిళల జట్టు అమెరికాను 6-5 తేడాతో ఓడించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

>
మరిన్ని వార్తలు