Major Moments Of Cricket In 2023: ఆరంభం.. ముగింపు ఒకేలా! అప్పుడు సౌతాఫ్రికా.. ఇప్పుడు టీమిండియా

24 Dec, 2023 15:28 IST|Sakshi
రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లి (Pc: BCCI)

Rewind: 2023... ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చిన రెండు జట్లకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఆఖరి మెట్టుపై బోల్తా పడేసి.. సొంతగడ్డపై అభిమానుల మధ్య కన్నీటి పర్యంతమయ్యేలా చేసింది. వీటితో పాటు ఈ ఏడాది ప్రపంచ క్రికెట్‌లో చోటు చేసుకున్న ప్రధాన ఘట్టాల గురించి తెలుసుకుందాం!!

1. ఆస్ట్రేలియా ముచ్చటగా మూడోసారి
సౌతాఫ్రికా వేదికగా ఈ ఏడాది ఆరంభంలో మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన తొమ్మిదవ ఎడిషన్‌లో సౌతాఫ్రికా జట్టు ఫైనల్‌కు చేరుకుంది.

ఓటమితో టోర్నీని ఆరంభించినా పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే, మెగ్‌ లానింగ్‌ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా టైటిల్‌ గెలవాలన్న సౌతాఫ్రికా ఆశలపై నీళ్లు చల్లింది.

బెత్‌ మూనీ అర్ద శతకం(53)కు తోడు బౌలర్లు రాణించడంతో 19 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. కేప్‌టౌన్‌ వేదికగా ట్రోఫీ గెలుపొంది.. ఏకంగా మూడోసారి టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.

2. డబ్ల్యూపీఎల్‌ ఆరంభం
భారత మహిళా క్రికెట్‌లో సువర్ణాధ్యాయానికి 2023లో నాంది పలికింది బీసీసీఐ. టీ20 లీగ్‌ ఫార్మాట్లో వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన మహిళా క్రికెటర్లను ఒక్క చోట చేర్చి ఐదు జట్లుగా విభజించి పోటీని నిర్వహించింది.

ఐపీఎల్‌ మాదిరి వేలంలో క్రికెటర్లను కొనుగోలు చేసే అవకాశం ఫ్రాంఛైజీలకు ఇచ్చింది. ఇక ఈ చరిత్రాత్మక ఈవెంట్లో మొట్టమొదటి టైటిల్‌ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ వుమెన్‌ టీమ్‌ నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై జట్టు.. మెగ్‌ లానింగ్‌ నేతృత్వంలోని ఢిల్లీని ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది.

3. ఆసియా కప్‌ విజేతగా టీమిండియా
ఆసియా వన్డే కప్‌-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకుంది. అయితే, తమ జట్టును అక్కడికి పంపేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి నిరాకరించడంతో హైబ్రిడ్‌ మోడల్‌లో టోర్నీని నిర్వహించింది ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌.

ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లకు శ్రీలంకను వేదికగా నిర్ణయించింది. ఇక ఈ టోర్నలో పాకిస్తాన్‌ సూపర్‌-4 దశలోనే నిష్క్రమించగా.. టీమిండియా- శ్రీలంక ఫైనల్‌ చేరాయి. తుదిపోరులో రోహిత్‌ శర్మ సేన లంకను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి సంచలన విజయంతో టైటిల్‌ను కైవసం చేసుకుంది.

4. జనాలు లేని వన్డే వరల్డ్‌కప్‌-2023 ఆరంభ మ్యాచ్‌
భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌-2023 టోర్నీ జరిగింది. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌- న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేచింది.

అయితే, క్రికెట్‌ను మతంలా భావించే భారత్‌లో వరల్డ్‌కప్‌ ఆరంభం పేలవంగా జరిగింది. ఎలాంటి హడావుడి, పెద్దగా ప్రేక్షకులు లేకుండానే తొలి మ్యాచ్‌ జరిగిపోయింది. ఈ పరిణామం క్రికెట్‌ ప్రపంచాన్ని విస్మయపరిచింది.

5. పసికూనలుగా వచ్చి.. సెమీస్‌ రేసులో నిలిచి
వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఏమాత్రం అంచనాలు లేకుండా అడుగుపెట్టిన జట్టు అఫ్గనిస్తాన్‌. ఆరంభ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్‌, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన అఫ్గన్‌.. ఆ తర్వాత జూలు విదిల్చిన సింహంలా చెలరేగింది.

వరుసగా ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, నెదర్లాండ్స్‌ను ఓడించి చరిత్రాత్మక విజయాలతో సెమీస్‌ రేసులో తానూ ఉన్నాననే సంకేతాలు పంపింది. టాపార్డర్‌లో యువ బ్యాటర్లు రాణించడం, రషీద్‌ ఖాన్‌ నాయకత్వంలోని స్పిన్‌ దళ రాణించడం అఫ్గన్‌కు కలిసివచ్చింది.

సెమీస్‌ చేరకపోయినా అద్భుత ప్రదర్శనలతో ఈసారి వరల్డ్‌కప్‌లో అఫ్గనిస్తాన్‌ తమదైన ముద్ర వేయగలిగింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ కంటే మెరుగ్గా రాణించి మధుర జ్ఞాపకాలు మిగిల్చుకుంది.

6. ఒలింపిక్స్‌లో క్రికెట్‌
విశ్వక్రీడల్లో బ్యాటర్ల మెరుపులు.. బౌలర్ల దూకుడు చూడాలని కోరుకుంటున్న అభిమానుల కల త్వరలోనే నెరవేరనుంది. 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు అంతర్జాతీయ ఒలంపిక్‌ కమిటీ  ఈ ఏడాది ఆమోదం తెలిపింది.

కాగా 1900 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ కూడా ఉంది. అయితే, ఆ తర్వాత మళ్లీ తిరిగి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఇక లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్లో పురుష, మహిళా జట్లు బరిలోకి దిగనున్నాయి.

7. మాక్సీ మాగ్జిమమ్‌ ఇన్నింగ్స్‌
వన్డే వరల్డ్‌కప్‌-2023లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఆస్ట్రేలియా  ఆల్‌రౌండర్‌ విధ్వంసకర ద్విశతకంతో చెలరేగాడు. సహచరులంతా చేతులెత్తేసిన వేళ.. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన తరుణంలో నేనున్నానంటూ ముందుకు వచ్చాడు.

తన చేతిలో ఏదో మంత్రదండం ఉందా అన్న అనుమానం కలిగేలా షాట్ల మీద షాట్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కండరాలు పట్టేయడంతో కదల్లేక క్రీజులో నిలబడిపోయినా మాక్సీ పట్టువీడక నభూతో అన్న చందంగా సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు.

మరో ఎండ్‌లో కెప్టెన్‌ కమిన్స్‌ సహకారం అందిస్తుండగా.. 201 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

8. రికార్డుల రారాజు కిరీటంలో అరుదైన కలికితురాయి
టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు బాదుతూ.. టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ శతకాల రికార్డుకు ఎసరుపెట్టిన కోహ్లి.. వన్డేల్లో అతడిని అధిగమించాడు.

వన్డే ప్రపంచకప్‌-2023లో తన పుట్టినరోజు(నవంబరు 5) నాటి మ్యాచ్‌లో సచిన్‌ వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లి.. న్యూజిలాండ్‌తో సెమీస్‌ సందర్భంగా అతడి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో 50వ సెంచరీ నమోదు చేశాడు. 

9. ఆరోసారి జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియా
సొంతగడ్డపై వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌కు చేరుకున్న టీమిండియాకు ఆస్ట్రేలియా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆరంభంలో తడబడ్డా.. తమకే సాధ్యమైన రీతిలో పుంజుకుని ఏకంగా విశ్వవిజేతగా అవతరించింది.

అహ్మదాబాద్‌లో లక్ష మందికి పైగా టీమిండియా అభిమానుల ప్రత్యక్షంగా చూస్తుండగా.. రోహిత్‌ శర్మ సేనను ఓడించి ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడింది. ట్రవిస్‌ హెడ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చి వరల్డ్‌కప్‌ హీరోల జాబితాలో తన పేరునూ లిఖించుకున్నాడు.  

10. ఆస్ట్రేలియాపై భారత్‌ తొలి టెస్టు గెలుపు
భారత మహిళా క్రికెట్‌ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై తొలి టెస్టు గెలుపు నమోదు చేసింది. బ్యాటర్లు, బౌలర్లు రాణించడంతో ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా జయకేతనం ఎగురవేసింది హర్మన్‌ప్రీత్‌ బృందం. ఇక ఇంతవరకు ఇరు జట్ల మధ్య పదకొండు టెస్టులు జరుగగా.. నాలుగు ఆసీస్‌ గెలవగా.. ఒకటి భారత్‌ సొంతమైంది. ఆరు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

>
మరిన్ని వార్తలు