వరుణుడి అడ్డుపుల్ల

24 Nov, 2018 00:50 IST|Sakshi

రెండో టి20 రద్దు  

ఆస్ట్రేలియా 132/7  

ఆకట్టుకున్న భువనేశ్వర్‌  

ఆదివారం చివరి టి20

మెల్‌బోర్న్‌: ప్చ్‌...! టీమిండియాకు మళ్లీ నిరాశ! చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటింగ్‌ ఆర్డర్‌ను పడగొట్టిన తర్వాత... స్వల్ప లక్ష్యాన్ని అందుకుని సిరీస్‌లో నిలుద్దామని ఆశించిన కోహ్లి సేనకు వరుణుడు సైంధవుడిలా అడ్డుపడ్డాడు. రెండుసార్లు ఆగినట్టే ఆగిన వాన... భారత్‌ ఛేదనకు దిగనుందనే సరికి మళ్లీ మొదలైంది. దీంతో ఆస్ట్రేలియాతో శుక్రవారం రెండో టి20 రద్దయింది. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌... భువనేశ్వర్‌ (2/20), ఖలీల్‌ అహ్మద్‌ (2/39) ధాటికి 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 132 పరుగులే చేసింది.  బెన్‌ మెక్‌డెర్మాట్‌ (30 బంతుల్లో 32 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. బుమ్రా, కుల్దీప్, కృనాల్‌ పాండ్యా పొదుపుగా బంతులేసి ఒక్కో వికెట్‌ తీశారు. సరిగ్గా ఇదే సమయానికి వర్షం గంటపైగా సమయం అంతరాయం కలిగించింది. తర్వాత డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం భారత్‌ లక్ష్యాన్ని 11 ఓవర్లలో 90 పరుగులుగా నిర్దేశించారు. కానీ, అంతలోనే జల్లులు మొదలై ఆటకు వీలుకాలేదు. అరగంట తర్వాత మరోసారి లక్ష్యాన్ని 5 ఓవర్లలో 46 పరుగులుగా సవరించి మ్యాచ్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నించారు. అయితే, వరుణుడు ఇందుకూ అవకాశం ఇవ్వలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1–0 ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్‌ ఆదివారం సిడ్నీలో జరుగనుంది. 

బౌలర్లు కట్టడి చేశారు 
ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో యువ ఆల్‌రౌండర్‌ మెక్‌డర్మాట్‌ మినహా మిగతావారు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. కెప్టెన్‌ ఫించ్‌ (0)ను రెండో బంతికే ఔట్‌ చేసి భువనేశ్వర్‌ ఇచ్చిన శుభారంభాన్ని ఆసాంతం కొనసాగించిన భారత బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. మధ్యలో రెండు క్యాచ్‌లు నేలపాలైనా ఆ ప్రభావం పడకుండా చూశారు. పేస్‌ త్రయంలో భువీ, ఖలీల్‌ వికెట్ల వేట కొనసాగించగా, బుమ్రా (1/20) ఎప్పటిలాగే పరుగులు నిరోధించాడు. క్రిస్‌ లిన్‌ (13)ను స్లో బంతితో బోల్తాకొట్టించిన ఖలీల్‌... డీయార్సీ షార్ట్‌ (14)ను బౌల్డ్‌ చేశాడు. స్టొయినిస్‌ (4) బుమ్రా బౌలింగ్‌లో డీప్‌ పాయింట్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో ఆసీస్‌ 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గత మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లతో తనను కలవరపెట్టిన మ్యాక్స్‌వెల్‌ (19)ను చక్కటి స్పిన్‌తో కృనాల్‌ పాండ్యా పెవిలియన్‌ పంపాడు. కుల్దీప్‌... క్యారీ (4) పని పట్టాడు. మెక్‌డెర్మాట్‌కు జత కలిసిన కూల్టర్‌నీల్‌ (9 బంతుల్లో 18; 1 ఫోర్, 2 సిక్స్‌లు) బ్యాట్‌ ఝళిపించడంతో స్కోరు వంద దాటింది. ఖలీల్‌ వేసిన 18వ ఓవర్లో... ఆండ్రూ టై రెండు ఫోర్లు, మెక్‌డెర్మాట్‌ సిక్స్‌ బాదడంతో 19 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్లో బుమ్రా 10 పరుగులిచ్చాడు. మోస్తరు లక్ష్యాన్ని భారత్‌ ఛేదించేలా కనిపించిన పరిస్థితుల్లో వర్షం అంతా మార్చేసింది.  

మరిన్ని వార్తలు