ఐసీసీ.. మా వాటా మాకు ఇవ్వాల్సిందే: గంగూలీ

15 Oct, 2019 10:56 IST|Sakshi

ముంబై: త్వరలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ.. అప్పుడే తన ఆట మొదలు పెట్టేశాడు. ప్రధానంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నుంచి బీసీసీఐకి దక్కాల్సిన వాటాలో భారీగా కోత పడటంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.  ఓవరాల్‌గా వచ్చే ఆదాయంలో తమకు ఎంత వాటా రావాలో అంత రావాల్సిందేనని ఐసీసీకి కచ్చితమైన సందేశాన్ని పంపాడు.  ఐసీసీ నుంచి తమకు ఎంత రావాలో అంత వచ్చి తీరాలంటున్నాడు గంగూలీ.

కొంతకాలం క్రితం వరకు బీసీసీఐ ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ నుంచి భారీ రెవెన్యూను దక్కించుకునేది. అయితే రెండేళ్ల క్రితం నూతన రెవెన్యూ పద్ధతి రావడంతో భారత క్రికెట్‌ బోర్డు ఆదాయంలో భారీ కోత పడింది. 2016 నుంచి 2023 వరకూ ఉండే ఎనిమిదేళ్ల పరిధిలో 293 మిలియన్‌ డాలర్లు మాత్రమే అందుకోనుంది. అయితే తమ వాటా ప్రకారం బీసీసీఐకి రావాల్సింది దానికి రెట్టింపు అనేది గంగూలీ వాదన.

భారత క్రికెట్‌ బోర్డు ఇప్పుడు ఇదే అంశంపై గంగూలీ దృష్టి పెట్టబోతున్నాడు.. ‘కొన్నేళ్లుగా ఐసీసీ నుంచి బీసీసీఐకి రావాల్సినంతగా డబ్బు రావడం లేదు. ఇప్పుడొచ్చేదానికన్నా ఎక్కువగా వచ్చేందుకు మాకు అర్హతలున్నాయి. ఓవరాల్‌గా ఐసీసీకి వచ్చే ఆదాయంలో భారత్‌ నుంచే 75-80 శాతం వెళుతుంది. మరి దీనికి తగ్గట్టుగానే మాకు పంచాల్సి ఉంటుంది. భారత జట్టు కెప్టెన్‌గా ఆడటంకంటే గొప్ప గౌరవానికి మరేదీ సాటి రాదు. 2000లో నేను కెప్టెన్‌ అయినప్పుడు కూడా ఫిక్సింగ్‌లాంటి సమస్యలు ఉన్నాయి. నేను వాటిని సరిదిద్దగలనని వారు భావించారు. ఇక్కడ అధ్యక్షుడు అయ్యే వ్యక్తి ఆటగాడా, కాదా అనేది అనవసరం. సమర్థుడు కావడం ముఖ్యం’ అని గంగూలీ తెలిపాడు.

మరిన్ని వార్తలు