నేడే ఐపీఎల్‌ వేలం 

18 Dec, 2018 00:03 IST|Sakshi

జైపూర్‌ వేదికగా నిర్వహణ యువరాజ్‌ను తీసుకొనేదెవరో?

జైపూర్‌: జనరంజక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వేలానికి రంగం సిద్ధమైంది. 2019 సీజన్‌కు అవసరమైన ఆటగాళ్ల కొనుగోలుకు ఫ్రాంచైజీలు మంగళవారం ‘పింక్‌ సిటీ’ జైపూర్‌ వేదికగా పోటీపడనున్నాయి. తుది వడపోత అనంతరం మిగిలిన 346 మంది నుంచి 70 మందిని ( 20 మంది విదేశీ, 50 మంది స్వదేశీ) లీగ్‌లోని 8 జట్లు ఎంపిక చేసుకోనున్నాయి. ఫ్రాంచైజీలన్నీ జనవరిలో నిర్వహించిన వేలంలో భారీ మార్పుచేర్పులు చేశాయి. దీంతో  చిన్నపాటి కసరత్తుతోనే ఈ కార్యక్రమం ముగియనుంది. వచ్చే ఏడాది మే నెలాఖరు నుంచి వన్డే ప్రపంచ కప్‌ ఉన్నందున... లీగ్‌ మార్చి 23 నుంచే ప్రారంభమై మే రెండో వారంలో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీల సన్నాహాలకు, ప్రపంచ కప్‌ నాటికి క్రికెటర్లు తమ జాతీయ జట్లకు అందుబాటులో ఉండేలా డిసెంబరులోనే వేలం ముగించేస్తున్నారు. 

విదేశీయుల అందుబాటు ప్రధానం 
ఐపీఎల్‌ ముగింపు–ప్రపంచకప్‌నకు పెద్దగా వ్యవధి లేనందున న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్‌ మినహా మిగతా దేశాల బోర్డులన్నీ తమ ఆటగాళ్లకు పరిమితంగానే అనుమతులిచ్చాయి. దీంతో వారు ఏ దశ వరకు అందుబాటులో ఉంటారనేదానిపై ఆయా జట్ల కోచ్‌లు, యజమానులు ప్రధానంగా దృష్టిసారించనున్నారు. 

ఇక్కడా? అక్కడా? ఎక్కడ? 
ఏప్రిల్‌–మే మధ్య దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున ఐపీఎల్‌ నిర్వహణ ఎక్కడ అనేదానిపై జనవరి మూడోవారంలో బీసీసీఐ నుంచి స్పష్టత రానున్నట్లు సమాచారం. 

యువరాజ్‌... రూ.కోటికే! అయినా? 
ఒకనాడు రూ.16 కోట్లు అందుకున్న టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌... ప్రçస్తుతం రూ.కోటి ప్రాథమిక ధరకే వేలానికి వచ్చాడు. అయినప్పటికీ అతడిని ఎవరూ కొనే పరిస్థితి లేదు. రూ.2 కోట్ల బేస్‌ ప్రైస్‌లోని 9 మంది విదేశీయుల్లో   ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ స్యామ్‌ కరన్‌పై అందరి దృష్టి ఉంది.  2018 సీజన్‌లో రూ.11.5 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడిన పేసర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ ఇప్పుడు రూ.కోటిన్నర కనీస మొత్తానికే అందుబాటులోకి వచ్చాడు. 

మధ్యాహ్నం  గం. 3.30 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

మరిన్ని వార్తలు