ఐఎస్‌ఎల్‌-ప్రీమియర్‌ లీగ్‌ల మధ్య కొత్త ఒప్పందం

28 Feb, 2020 20:47 IST|Sakshi

ముంబై : ప్రీమియర్‌ లీగ్‌, ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌)ల మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. నెక్ట్స్‌ జనరేషన్‌ ముంబై కప్‌లో భాగంగా శుక్రవారం ఫుట్‌బాల్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ, ప్రీమియర్‌ లీగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌ మాస్టర్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా నీతా అంబానీ, రిచర్డ్‌లు కొత్త ఒప్పందంపై సంతకం చేశారు. గత ఆరేళ్ల నుంచి ఈ రెండు లీగ్‌లు కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఒప్పందం ప్రకారం భారతలో ఫుట్‌బాల్‌ అభివృద్ధితోపాటు, కోచింగ్‌ సౌకర్యాలు, యువతలో ఫుట్‌బాల్‌ నైపుణ్యాలు పెంపొందించడానికి ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. 

ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ప్రీమియర్‌ లీగ్‌తో ఐఎస్‌ఎల్‌ భాగస్వామ్యం మరో దశకు చేరుకుందన్నారు. గత ఆరేళ్లుగా భారత్‌లో ఫుట్‌బాల్‌ అభివృద్ధి తాము చేసిన కృషి సంతృప్తినిచ్చిందని తెలిపారు. యువతలో నైపుణ్యం పెంపొందించడం, కోచింగ్‌, రిఫరీ అంశాలను మరింత బలోపేతం చేయడానికి రెండు లీగ్‌ల మధ్య కుదిరిన నూతన ఒప్పందం తోడ్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

రిచర్డ్‌ మాస్టర్స్‌ మాట్లాడుతూ.. ఐఎస్‌ఎల్‌తో కొత్త ఒప్పందాన్ని చేసుకోవడం భారత్‌లో ఫుట్‌బాల్‌ అభివృద్ధికి తమ నిబద్ధతను మరోసారి చాటిచెప్పింది. ఇందుకు తాము చాలా సంతోషిస్తున్నాం. గత ఆరేళ్లుగా ఐఎస్‌ఎల్‌ భాగస్వామ్యంతో ఫుట్‌బాట్‌ కోచింగ్‌, అభివృద్ధి, అలాగే మౌలిక సదుపాయాలకు మద్దతిచ్చాం. కొత్త ఒప్పందం ద్వారా యువతలో ఫుట్‌బాల్‌ నైపుణ్యాన్ని పెంపొందించడం, భారత్‌లో ఫుట్‌బాల్‌ పరిధిని విస్తృత పరిచేందుకు ఎదురుచూస్తున్నామ’ని తెలిపారు. 

>
మరిన్ని వార్తలు