‘టోక్యో’ వాయిదా తప్పదేమో !

23 Mar, 2020 04:48 IST|Sakshi
నిర్మాణం పూర్తి చేసుకున్న టోక్యో ఒలింపిక్స్‌ ప్రధాన స్టేడియం

ఆ దిశగానే ఐఓసీ, జపాన్‌ అడుగులు

త్వరలోనే  నిర్ణయం  

ఇప్పుడు కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో భారత్‌లో ఐపీఎల్‌ దారి దాదాపు మూసుకుపోయింది! అలాగే ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షలపైగా దాటిన కరోనా బాధితులతో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), నిర్వాహక దేశం జపాన్‌ ఆలోచనలో పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాయిదా తప్ప వేరే మార్గమే లేదని అంచనాకు వచ్చిన ఐఓసీ తెరవెనుక అదే పనిచేస్తున్నా... బయటికి మాత్రం చెప్పలేకపోతోంది. దీంతో జులై 24న టోక్యోలో ఒలింపిక్స్‌ జే గంట మోగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.   

టోక్యో: కరోనా ఎంత పనిచేసింది. వుహాన్‌లో మొదలుపెట్టిన మృత్యు ఘంటికల్ని ప్రపంచమంతా మోగిస్తున్న ఈ ‘కోవిడ్‌–19’.... ఇటు వైరస్‌ బారిన పడిన బాధితుల్నే కాదు చాన్నాళ్లుగా జపాన్‌ ప్రభుత్వానికి, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)కి కంటిమీద కునుకే లేకుండా చేస్తోంది. దీంతో  షెడ్యూల్‌ ప్రకారం ఒలింపిక్స్‌ జరిపి తీరుతామన్న ఐఓసీ ఇప్పుడు వాయిదా వేసే పనిలో పడింది. ఎన్నో ప్రత్యామ్నాయాల్ని పరిశీలించి, చివరకు ప్లాన్‌ ‘బి’ కూడా సాధ్యం కాదనే అంచనాకు వచ్చింది. వాయిదా ఖాయమైనా అధికారికంగా ఇప్పుడప్పుడే వెల్లడించడం లేదు.

కానీ పాత షెడ్యూల్‌ ప్రకారం ఈవెంట్‌ జరిగే అవకాశం కూడా లేదు. ఎక్కడికక్కడ అన్నీ స్తంభించాయి. దేశ సరిహద్దులన్నీ మూతపడుతున్నాయి. చిన్న, పెద్ద పట్టణాలే కాదు... 24 గంటలు గడియారం ముల్లులా మెలకువగా ఉండే విశ్వనగరాలే లాక్‌డౌన్‌ అయ్యాయి. ప్రజారవాణా లేనే లేదు. ఐదు, పది మందికి మించి గుమిగూడే పరిస్థితులేవీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ లక్ష్యంగా శిబిరాలు నిర్వహించే అవకాశాల్లేవు. మిగతా క్వాలిఫయింగ్‌ ఈవెంట్లు జరగనే జరగవు. ఇవన్నీ క్షుణ్నంగా పరిశీలించిన ఐఓసీ ఓ నిర్ణయానికి వచ్చింది. రేపో మాపో కచ్చితంగా వెల్లడిస్తుంది. అదే టోక్యో ఒలింపిక్స్‌ ‘వాయిదా’ అని!

ప్రపంచం ‘వాచ్‌’ ఆగిపోతే... ఆటలా!
సెల్‌ఫోన్లు లేని రోజుల్లో మన చేతికున్న రిస్ట్‌ వాచ్‌ ఆగిపోతే ఎంత ఇబ్బంది అయ్యేదో అందరికీ తెలుసు. సమయపాలన అంతా చిన్నాభిన్నమయ్యేది. అలాంటిది ఇప్పుడు భూగోళం (గ్లోబ్‌) గడియారమే ఆగిపోయింది. కాసేపు ‘ప్రతిష్టంభన’ తట్టుకుంటామేమో కానీ ఈ ‘ప్రతిస్తంభన’ (అంటే రోజులపాటు ప్రతీది స్తంభించిపోవడం) ఎవరి తరం కాదు. ప్రపంచ వ్యవస్థే మూతపడిన ఈ వేళలో ఆటలెలా ఆడించేది అని ఐఓసీ ఓ నిర్ణయానికి వచ్చింది. జపాన్‌ ప్రజల్లోనూ వైరస్‌ భయాందోళనలున్నాయి.

ఇవన్నీ అక్కడి ప్రభుత్వానికీ తెలుసు. అందుకే ఐఓసీతో కలిసిపోయింది. ఏం చెబితే అదే అన్న ధోరణిలో ఉంది. కానీ పైకి మాత్రం నిర్వహణకే ఏర్పాట్లు అంటూ ఇప్పటికీ బీరాలు పలుకుతుంది. ఎందుకంటే జపాన్‌ దేశం టోక్యో విశ్వక్రీడలకు వేల కోట్ల డబ్బులను ఖర్చు చేసింది. స్పాన్సర్‌షిప్‌ల రూపేణా కోట్లకొద్దీ డబ్బులు పోగేసుకుంది. కోట్ల మొత్తంలో ఆర్థిక వ్యవహరాలు ముడిపడి ఉండటంతో ఆటలు సాగుతాయనే అంటుంది. కానీ బయట జరిగేది మాత్రం ‘వాయిదా’ ప్రక్రియే!  ఐఓసీ అధికారిక వర్గాల సమాచారం మేరకు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం పోటీలు జరిపి తీరే అవకాశాలే లేవని తెలుస్తోంది.

రేపోమాపో చెప్పక తప్పదు
ఇప్పటికైతే ప్లాన్‌ ‘బి’, ‘సి’, ‘డి’... ఇతరత్రా ప్రత్యామ్నాయాలున్నాయని చెబుతున్నా... చిట్టచివరికి ఆటలు నిర్దేశిత సమయంలో జరగవని, కాస్త ఆలస్యమవుతాయని ఐఓసీ రేపోమాపో చెప్పనుంది. లోగడ ఆయా దేశాల్లో కరోనా విలయం ఎలా ఉంది? ఆటగాళ్ల ప్రాక్టీసు సాగుతుందా ఆగిందా? అని ఆరా తీసింది. మిగిలున్న క్వాలిఫయింగ్‌ ఈవెంట్లు పూర్తి చేయడం, ప్రత్యామ్నాయ అర్హత అవకాశాలు కూడా లేకపోవడంతో సభ్య దేశాలకు చెందిన క్రీడా సమాఖ్యలు, ఒలింపిక్‌ సమాఖ్యలు, సంఘాలు, అంతర్జాతీయ క్రీడా పాలక మండలిలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉంది. టోక్యో ఈవెంట్‌కు 60 కంపెనీలు, సంస్థలు స్పాన్సర్‌ చేస్తున్నప్పటికీ ప్రధాన స్పాన్సర్లయిన టయోటా మోటార్‌ కార్ప్, ప్యానసోనిక్‌ కార్ప్‌ సంస్థలకు సమస్య అర్థమై ఆందోళన చెందుతున్నాయి. జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ కంపెనీ కూడా షెడ్యూల్‌ ప్రకారం ఒలింపిక్స్‌ జరిగే అవకాశమే లేదని తెగేసి చెప్పింది.  

వాయిదా సరే... రద్దయితే?
జపాన్‌ ప్రభుత్వం ఎన్ని చెప్పినా... ఒలింపిక్స్‌ వాయిదా దాదాపు ఖాయమైనట్లేనని ఐఓసీ వర్గాలే చెబుతున్నాయి. కానీ మరో రెండేళ్ల వరకు అంతర్జాతీయ క్రీడల క్యాలెండర్‌ బిజీబిజీగా ఉంది. 2021 సమ్మర్‌ సీజన్‌ ఏమాత్రం ఖాళీ లేదు. 2022 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ , బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లతో నిండిపోయింది. మరి వాయిదా కొన్ని నెలలపాటే అయితే కుదరొచ్చు కానీ వచ్చే ఏడాది అంటే మాత్రం మొదటికే మోసమొస్తుంది.

పైగా ‘టోక్యో’ను ప్రతీ 40 ఏళ్ల ఒలింపిక్స్‌ భయాలు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940 ఒలింపిక్స్‌ రద్దుకాగా... మరో 40 ఏళ్లకు మాస్కోలో జరిగిన 1980 ఒలింపిక్స్‌ను జపాన్‌ బహిష్కరించింది. ఇప్పుడు మళ్లీ 40 ఏళ్లకు జపానే ఆతిథ్యమివ్వనున్న క్రీడలకు కూడా అదేగతి పడుతుందా అనే ఆందోళనలో జపాన్‌ విలవిలలాడుతోంది.
 

మరిన్ని వార్తలు