గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌

13 Apr, 2019 00:09 IST|Sakshi

కేకేఆర్‌పై ఢిల్లీ ఘనవిజయం

ధావన్‌ సెంచరీ చేసే అవకాశం ఇవ్వని ఇన్‌గ్రామ్‌

కోల్‌కతా: తాజా ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు పెద్దగా బ్యాట్‌ ఝులిపించని శిఖర్‌ ధావన్‌.. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శివతాండవం చేశాడు. స్థానిక ఈడెన్‌ గార్డెన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శిఖర్‌ ధావన్‌ (97 నాటౌట్‌; 63 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు)  ఒంటిచేత్తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయాన్నందించాడు.  కేకేఆర్‌ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని.. 18.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ ఛేదించింది. దీంతో అయ్యర్‌ సేన ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యున్నత ప్రదర్శన కనబర్చిన కేకేఆర్‌ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. కనీస పోరాటం ప్రదర్శించకుండానే కార్తీక్‌ సేన చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఢిల్లీ విజయంలో  ధావన్‌తో పాటు రిషబ్‌ పంత్‌(46; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకపాత్ర పోషించాడు. కేకేఆర్‌ బౌలర్లలో ప్రసీద్‌, రసెల్‌, రాణాలు తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ధావన్‌ దంచికొట్టాడు..
ఈ సీజన్‌లో ఇప్పటివరకు అంతగా ఆకట్టుకోని ధావన్‌ కేకేఆర్‌తో మ్యాచ్‌తో ఫామ్‌ అందుకున్నాడు. తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డు పరిగెత్తించాడు. ధావన్‌కు తోడుగా పంత్‌ తనవంతు బాధ్యత నిర్వర్తించాడు. అయితే అలవాటులో భాగంగా పంత్‌ మరోసారి విజయం ముంగిట అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇన్‌గ్రామ్‌ ధావన్‌ సెంచరీ చేయనివ్వలేదు. చివరి 12 బంతుల్లో 12 పరుగులు కావాల్సిన సమయంలో ధావన్‌కు ఎక్కువ అవకాశం ఇవ్వకుండా ఫోర్‌, సిక్సర్‌ బాది జట్టుకు విజయాన్నందించాడు. గెలుపు ఖాయమైన తర్వాత ధావన్‌కు సెంచరీ చేసే అవకాశం ఇవ్వకపోవడం పట్ల ధావన్‌ అభిమానులు నిరుత్సాహపడ్డారు.
రాణించిన గిల్‌, రసెల్‌
అంతకుముందు శుభ్‌మన్‌ గిల్‌(65; 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)తోడుగా ఆండ్రీ రసెల్‌(45; 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడాడు.  ఆ తర్వాత రాబిన్‌ ఊతప్ప(28), చివర్లో పీయూష్‌ చావ్లా(14నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. దీంతో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్‌ మోరిస్‌, రబడ, కీమో పాల్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, ఇషాంత్‌ శర్మకు వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు