ఐపీఎల్‌ ఫైనల్‌ హైదరాబాద్‌లో!

9 Apr, 2019 05:36 IST|Sakshi

కొనసాగుతున్న చెన్నై ‘స్టాండ్స్‌’ వివాదం

న్యూఢిల్లీ: ఐపీఎల్‌–2019 తుది పోరు హైదరాబాద్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనల్‌కు వేదికగా ఉప్పల్‌ స్టేడియాన్ని సీఓఏ దాదాపుగా ఖరారు చేసింది. చెన్నైలో ‘స్టాండ్స్‌’ సమస్యకు పరిష్కారం లభించకపోతే ఇదే ఖాయమవుతుంది. వాస్తవానికి గత ఏడాది సూపర్‌ కింగ్స్‌ విజేతగా నిలవడంతో చెన్నైలో ఫైనల్‌ మ్యాచ్‌ జరగాలి. అయితే చిదంబరం స్టేడియంలో ఏడేళ్లుగా కొనసాగుతున్న ‘స్టాండ్స్‌’ వివాదం ఇంకా కొలిక్కి రాలేదు.

తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్, చెన్నై మున్సిపల్‌ కార్పొరేషన్‌ మధ్య గొడవ కారణంగా ఏ మ్యాచ్‌ జరిగినా కూడా మూడు స్టాండ్‌లు అప్పటినుంచి ఖాళీగానే ఉంటున్నాయి. అయితే దీనిని తేల్చుకునేందుకు అసోసియేషన్‌కు సీఓఏ వారం రోజులు గడువిచ్చింది. ‘మూడు స్టాండ్‌లు అంటే 12 వేల మంది ప్రేక్షకులు. ఇంత మంది కనిపించకపోతే మైదానం బోసిపోతుంది. ప్లే ఆఫ్‌కు వెళితే సొంత మైదానంలో ఆడే అవకాశం చెన్నై కోల్పోరాదని మేమూ కోరుకుంటున్నాం. అయితే క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తీసుకు రాకపోతే 2018 రన్నరప్‌ హైదరాబాద్‌లోనే ఫైనల్‌ నిర్వహిస్తాం. ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు బెంగళూరులో     జరుగుతాయి’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

మహిళలతో మినీ ఐపీఎల్‌...
సీఓఏ సమావేశంలో మరికొన్ని ఇతర నిర్ణయాలు తీసుకున్నారు. ఐపీఎల్‌తో సమాంతరంగా నిర్వహించనున్న మహిళల మినీ ఐపీఎల్‌లో మూడు జట్లు ఉంటాయి. గత ఏడాది జరిగిన ఒకే ఒక ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌కు భిన్నంగా ఈసారి మొత్తం నాలుగు మ్యాచ్‌లు నిర్వహిస్తారు. వీటిలో ఒక మ్యాచ్‌కు విశాఖపట్నం వేదిక కానుండగా...మిగిలిన మూడు మ్యాచ్‌లు బెంగళూరులో జరిగే అవకాశం ఉంది. మరో వైపు భారత్‌లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లు, దేశవాళీ మ్యాచ్‌ల కోసం ఇప్పటి వరకు టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్న పేటీఎమ్‌ ఒప్పంద గడువు ముగిసింది. దాంతో కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని బోర్డు నిర్ణయించింది. వచ్చే రెండు వారాల్లో భారత క్రికెట్‌కు సంబంధించి ‘ప్లేయర్స్‌ అసోసియేషన్‌’ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు