ఆర్సీబీతో మ్యాచ్‌: సీఎస్‌కే లక్ష్యం 162

21 Apr, 2019 21:58 IST|Sakshi

బెంగళూరు: ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్బీబీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సారథి విరాట్‌ కోహ్లి(9)ని దీపక్‌ చహర్‌ ఔట్‌ చేశాడు. చహర్‌ వేసిన ఆఫ్‌ స్టంప్‌ బంతిని ఆడబోయి కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌ ఆరంభం నుంచి దాటిగా ఆడాడు. అదే జోరులో జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి డివిలియర్స్‌(25) వెనుదిరిగాడు. దీంతో 58 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి ఆర్సీబీ కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో పార్థీవ్‌ పటేల్‌, అక్ష్‌దీప్‌ నాథ్‌లు ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ అచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ముఖ్యంగా యువ ఆటగాడు అక్ష్‌దీప్‌ సిక్స్‌లు కొట్టిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరో వైపు పార్థీవ్‌ పటేల్‌ బాధ్యతాయుతంగా ఆడుతూనే అర్దసెంచరీ పూర్తి చేశాడు.  అయితే స్కోర్‌ పెంచే యత్నంలో భారీ షాట్లకు యత్నించి అక్ష్‌దీప్‌(24) అవుటయ్యాడు. అనంతరం వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ తక్కువ స్కోర్‌కే పరిమితం అవుతుందునుకున్నారు. అయితే చివర్లో మొయిన్‌ అలీ(26) మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ నిర్ణీత 20ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో చహర్‌, జడేజా, బ్రేవో తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తాహీర్‌ ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు. 


 

మరిన్ని వార్తలు