మూడో టైటిల్‌ వేటలో...

21 Mar, 2019 00:00 IST|Sakshi

బ్యాటింగ్, స్పిన్‌ను నమ్ముకున్న కోల్‌కతా

ప్రధాన పేసర్‌ లేని నైట్‌రైడర్స్‌   

సొంత అభిమానుల అశేష మద్దతు ఉన్న గంగూలీ కెప్టెన్‌గా తొలి మూడు సీజన్లు పేలవ ప్రదర్శన కనబర్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గౌతమ్‌ గంభీర్‌ రాకతో అనూహ్యంగా పుంజుకుంది.  రెండు సార్లు చాంపియన్‌గా నిలవడంతో పాటు ప్రతీ సంవత్సరం నిలకడైన ప్రదర్శన కనబర్చింది. గత ఐదు సీజన్లలో నాలుగు సార్లు టాప్‌–4లో నిలిచిన ఆ జట్టు మళ్లీ ఇప్పుడు టైటిల్‌ వేటలో నిలిచింది. మొదటి నుంచి జట్టు బలంగా నిలిచిన బ్యాటింగ్, స్పిన్‌నే ఆ జట్టు మరోసారి నమ్ముకుంది. కెప్టెన్‌గా గత సీజన్‌లో ఆకట్టుకున్న దినేశ్‌ కార్తీక్‌ ఈ సారి తన జట్టుతో పాటు తన వరల్డ్‌ కప్‌ అవకాశాలను కూడా పెంచుకోవాల్సిన స్థితిలో బరిలోకి దిగుతున్నాడు.   

బలాలు: గత ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున దినేశ్‌ కార్తీక్‌ 498 పరుగులు, క్రిస్‌ లిన్‌ 491 పరుగులతో టాప్‌ స్కోరర్లుగా నిలవగా, ఇతర ప్రధాన బ్యాట్స్‌మెన్‌ ఉతప్ప, నితీశ్‌ రాణా, రసెల్‌ కూడా నిలకడగా రాణించారు. వీరికి తోడు ఓపెనర్‌గా వచ్చిన బౌలర్‌ సునీల్‌ నరైన్‌ కూడా ఏకంగా 190 స్ట్రయిక్‌రేట్‌తో 357 పరుగులు చేయడం ఆ జట్టుకు బాగా కలిసొచ్చింది. లీగ్‌లో ఎక్కువ బౌండరీలు (253 ఫోర్లు, 130 సిక్సర్లు) బాదిన జట్టుగా నైట్‌రైడర్స్‌ నిలిచింది. ఈ సారి కూడా వీరంతా జట్టులో భాగంగా ఉన్నారు. కాబట్టి మరోసారి జట్టుకు బ్యాటింగే ప్రధాన బలం కానుంది. యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ కూడా రాణిస్తే ఇక ఎలాంటి ఆందోళన ఉండదు. గతేడాది ఢిల్లీ తరఫున విఫలమైనా... ఈ సారి కోల్‌కతాతో చేరిన కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ తనదైన రోజున చెలరేగిపోగలడు. బౌలింగ్‌లో స్పిన్‌ త్రయం నరైన్, కుల్దీప్‌ యాదవ్, పీయూష్‌ చావ్లా చెలరేగితే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పవు. తమ దేశ వరల్డ్‌ కప్‌ టీమ్‌లలో అవకాశాలు లేని క్రిస్‌ లిన్, నరైన్‌లు టోర్నీ మొత్తం అందుబాటులో ఉండనుండటం సానుకూలాంశం. కొన్ని స్వల్ప మార్పులు ఉన్నా... చాలా ఏళ్లుగా జట్టు విజయాల్లో భాగంగా ఉన్న ప్రధాన ఆటగాళ్లంతా కొనసాగుతుండటం జట్టుకు మేలు చేయనుంది.  

బలహీనతలు: గత సంవత్సరం ఐపీఎల్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన ప్రసిద్ధ్‌ కృష్ణనే ఇప్పుడు కోల్‌కతా ప్రధాన పేసర్‌ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇటీవలే ముగిసిన ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కర్ణాటక తరఫున అతను 7 మ్యాచ్‌లలో కలిపి 6 వికెట్లే తీయడం అతని ఫామ్‌ ఏమిటో చెబుతుంది! కమలేశ్‌ నాగర్‌కోటి, శివమ్‌ మావి ఇప్పటికే గాయాలతో దూరం కాగా, దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ అన్‌రిచ్‌ నోర్టే కూడా గాయంతో బుధవారమే జట్టుకు దూరమయ్యాడు. ఫెర్గూసన్‌ ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటా డో తెలియకపోగా, గర్నీ తొలిసారి ఐపీఎల్‌ ఆడుతున్నాడు. చెప్పుకోదగ్గ పేస్‌ బౌలర్‌ ఒక్కరు కూడా లేకుండా ముందుకెళ్లటం అంత సులువు కాదు.   

అవకాశం దక్కేనా: విదేశీ ప్లేయర్లలో లిన్, నరైన్, రసెల్‌లకు అన్ని మ్యాచ్‌లలో చోటు ఖాయం కాబట్టి నాలుగో ఆటగాడిగా బ్రాత్‌వైట్‌ లేదా ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ డెన్లీలలో ఒకరిని ఎంచుకోవచ్చు. మరోవైపు జట్టులో ఆంధ్ర పేసర్‌ యెర్రా పృథ్వీరాజ్‌ కూడా ఉన్నాడు. పేస్‌ బౌలింగ్‌ ప్రత్యామ్నాయాలు పెద్దగా అందుబాటులో లేకపోవడంతో దేశవాళీ పేసర్‌గా అతడికి మ్యాచ్‌ దక్కే అవకాశం ఉంది.   

జట్టు వివరాలు: దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌), ఉతప్ప, సందీప్‌ వారియర్, కుల్దీప్, శ్రీకాంత్‌ ముండే, పీయూష్‌ చావ్లా, నిఖిల్‌ నాయక్, ప్రసిద్ధ్‌ కృష్ణ, శుబ్‌మన్, నితీశ్‌ రాణా, రింకూ సింగ్, కరియప్ప, యెర్రా పృథ్వీరాజ్‌ (భారత ఆటగాళ్లు), బ్రాత్‌వైట్, గర్నీ, నరైన్, ఫెర్గూసన్, రసెల్, లిన్, డెన్లీ (విదేశీ ఆటగాళ్లు).

అత్యుత్తమ ప్రదర్శన:
2012, 2014లలో విజేతగా నిలిచినకోల్‌కతా నైట్‌రైడర్స్‌ 2018లో మూడో స్థానంలో నిలిచింది.   

>
మరిన్ని వార్తలు