అప్పటివరకూ ఐపీఎల్‌ వాయిదా..!

16 Apr, 2020 18:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌-13వ సీజన్‌ మరోసారి వాయిదా పడింది. గత నెల్లో ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ వాయిదా వేసిన బీసీసీఐ.. ఈసారి నిరవధిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఐపీఎల్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు  బీసీసీఐ సెక్ర‌ట‌రీ జ‌య్ షా అధికారికంగా తెలియజేశారు. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసే విషయాన్ని బుధవారమే ఫ్రాంచైజీలకు తెలియజేయగా, తాజాగా దీనిపై ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి అధికారికంగా నిర్ణయాన్ని ప‍‍్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావం పూర్తిగా తగ్గిపోయి ఎటువంటి ప్రమాదం లేదు అన్నప్పుడే ఐపీఎల్‌ కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు.(నాకైతే అనుమానమే లేదు: దినేశ్‌ కార్తీక్‌)

అప్పటివరకూ ఐపీఎల్‌పై నిరవధిక వాయిదా కొనసాగుతుందన్నారు. కోవిడ్‌-19 వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం వైర‌స్ నియంత్రణ‌ చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ద‌ని, దానిలో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్ర‌జ‌ల ఆరోగ్యం రక్షణ చాలా ముఖ్య‌మ‌ని, దానికి తాము అధిక ప్రాధాన్య‌త ఇస్తామ‌ని, బీసీసీఐతో పాటు ఫ్రాంచైజీ ఓన‌ర్లు, బ్రాడ్‌కాస్ట‌ర్లు, స్పాన్స‌ర్స్‌, ఇత‌ర స్టేక్‌హోల‌ర్లు ఐపీఎల్ 2020 సీజ‌న్‌ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు షా తెలిపారు.  అయితే మ‌ళ్లీ అనువైన పరిస్థితులు ఏర్పడిన తర్వాతే ఐపీఎల్‌ నిర్వహణపై తదుపరి నోటీసులు జారీ చేస్తామన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిపై బీసీసీఐ నిత్యం స‌మీక్ష నిర్వ‌హిస్తూ ఉంటుంద‌న్నారు.  (ధోనికి మద్దతుగా కైఫ్‌.. రాహుల్‌ వద్దు!)

>
మరిన్ని వార్తలు