ఐపీఎల్‌‌-2018; చెన్నైకి భారీ షాక్‌

11 Apr, 2018 16:47 IST|Sakshi
చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీం (ఇన్‌సెట్‌లో కావేరీ ఉద్యమకారుడి మృతి, చెపాక్‌లో ఆటగాళ్లపైకి చెప్పులు)

ముంబై/చెన్నై: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన తమ జట్టు ఆటను సొంత గడ్డపై ఆస్వాదించే అవకాశాన్ని చైన్నై అభిమానులు కోల్పోయారు. అవును. కావేరీ నదీ జలాల వివాదం నానాటికీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ 2018 లో భాగంగా చెన్నైలో జరగాల్సిన మిగతా మ్యాచ్‌లను మరో చోట నిర్వహించాలని సీఎస్‌కే యాజమాన్యం, బీసీసీఐలు నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన వెలువడింది. చైన్నైలో జరగాల్సిన మ్యాచ్‌లు హైదరాబాద్‌ లేదా వైజాగ్‌కు తరలించే అవకాశం ఉంది.

ఆటగాళ్లపైకి చెప్పులు.. రైలింజన్‌పై కరెట్‌ షాక్‌: కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్టు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడులోని అన్ని పార్టీలూ గడిచిన రెండు నెలలుగా ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడిక్కడ ఆందోళనలు జరుగుతున్న క్రమంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ సరికాదనే భావన సర్వత్రా వ్యక్తమైంది. మంగళవారం నాటి చెన్నై-కోల్‌కతా మ్యాచ్‌కు కూడా తీవ్రస్థాయిలో బెదిరింపులు వచ్చాయి. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ మ్యాచ్‌ను నిర్వహించారు. అయినా కూడా చెన్నై ఆటగాళ్లపై ఆందోళనకారులు చెప్పులు, షూ విసిరి నిరసన తెలిపారు. ఇక బుధవారం తమిళ పార్టీలు చేపట్టిన రైల్‌రోకోలో ఓ ఉద్యమకారుడు అనూహ్యరీతిలో గాయపడ్డాడు. రైలింజన్‌ పైకెక్కి నిరసన తెలుపుతున్న యువకుడు.. హైటెన్షన్‌ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి.

చేతులెత్తేసిన పోలీసులు.. వెనక్కి తగ్గిన బోర్డు: కావేరీ నిరసనలను పట్టించుకోకుండా పోలీసుల సాయంతో తొలి మ్యాచ్‌ నిర్వహించిన క్రికెట్‌ బోర్డుకు బుధవారం నాటికి మద్దతు కరువైంది. ఉద్యమం తీవ్రతరం కావడంతో మున్ముందు జరగబోయే మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని పోలీసు శాఖ చేతులెత్తేసింది. దీంతో పునరాలోచనలోపడ్డ సీఎస్‌కే యాజమాన్యం, బీసీసీఐలు చివరికి మ్యాచ్‌లను చెన్నై నుంచి తరలించాలని నిర్ణయించారు. షెడ్యూల్‌ ప్రకారం చెన్నైలో జరగాల్సిన మ్యాచ్‌లను హైదరాబాద్‌ లేదా వైజాగ్‌లలో నిర్వహిస్తారని ప్రచారం జరుగుతున్నా, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

మరిన్ని వార్తలు