రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇర్ఫాన్‌ పఠాన్‌

4 Jan, 2020 18:05 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా బౌలర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ.. గంగూలీ, ద్రవిడ్‌, లక్ష్మణ్‌ వంటి క్రికెట్‌ దిగ్గజాలతో డ్రెస్సింగ్‌ రూం పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నాడు. తనకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికినా అభిమానులు తనకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నాడు.

గుజరాత్‌లోని వడోదరలో 1984లో జన్మించిన ఇర్ఫాన్‌ 2003లో జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అదే ఏడాది డిసెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాదే వన్డేల్లోనూ ప్రవేశించి సత్తా చాటాడు. ఇక ఇర్ఫాన్‌ పఠాన్‌ భారత్‌ తరఫున మొత్తం 120 వన్డేలు, 29 టెస్టులు, 24 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 306 వికెట్లు తీశాడు. వన్డేల్లో 173, టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 2821(వన్డేలు 1544, టెస్టులు 1105, టీ20 172 పరుగులు) పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి.

ఇక టీమిండియా మాజీ సారథి, దిగ్గజ బౌలర్‌ కపిల్‌ దేవ్‌ బౌలింగ్‌ శైలితో అభిమానులు ఇర్ఫాన్‌ను పోలుస్తారన్న సంగతి తెలిసిందే. 2007లో పాకిస్తాన్‌తో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇర్ఫాన్‌ మూడు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిన ఇర్ఫాన్‌ పఠాన్‌.. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో చివరిసారిగా(2012) మైదానంలోకి దిగాడు. ప్రస్తుతం అతడు జమ్మూ కశ్మీర్‌ క్రికెట్‌​ జట్టు మెంటార్‌ కమ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. క్రికెట్‌తో పాటు ఇర్ఫాన్‌ పఠాన్‌కు సినీ రంగంలోనూ ప్రవేశం ఉంది. 2015లో ఝలక్‌ ధిక్లాజా డ్యాన్స్‌ రియాలిటీ షోలో పాల్గొన్న ఈ బౌలర్‌... చియాన్‌ విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

>
మరిన్ని వార్తలు