జడేజా 'టాప్'లేపాడు

21 Mar, 2017 13:35 IST|Sakshi
జడేజా 'టాప్'లేపాడు

దుబాయ్:ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో విశేషంగా రాణించిన భారత్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్ లో తొలిసారి టాప్ స్థానంలో నిలిచాడు. ఇటీవల మరో భారత బౌలర్ రవి చంద్రన్ అశ్విన్ తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానం సాధించిన జడేజా.. తాజా బౌలర్ల ర్యాంకింగ్స్ లో సింగిల్ గా ప్రథమ స్థానంలో నిలిచాడు. రాంచీ టెస్టు అనంతరం అశ్విన్ కంటే 37 రేటింగ్ పాయింట్లను అధికంగా సంపాదించిన జడేజా తొలి స్థానాన్ని ఆక్రమించాడు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న మూడో భారత బౌలర్ గా జడేజా గుర్తింపు పొందాడు. బిషన్ సింగ్ బేడీ, అశ్విన్ ల తరువాత భారత్ నుంచి అగ్రస్థానం దక్కించుకున్న మూడో బౌలర్ జడేజా. ప్రస్తుతం జడేజా 899 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో, అశ్విన్ 862 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆల్ రౌండర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో, జడేజా మూడో స్థానంలో ఉన్నారు.

మరొకవైపు బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్ లో భారత టాపార్డర్ ఆటగాడు చటేశ్వర్ పుజారా రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. రాంచీ టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన పుజారా ఆరో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ సిరీస్ లో భారత నుంచి సెంచరీ సాధించిన ఆటగాడు పుజరా తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకుని ఇంగ్లండ్  స్టార్ ఆటగాడు జో రూట్ ను వెనక్కునెట్టాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్(941 రేటింగ్ పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా, పుజారా(861 రేటింగ్ పాయింట్లు) రెండో స్థానంలో నిలిచాడు. మరొకవైపు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో నాల్గో స్థానానికే పరిమితమయ్యాడు. గతవారం టెస్టు ర్యాంకింగ్స్ లో మూడో స్థానం నుంచి నాల్గో స్థానానికి పడిపోయిన కోహ్లి అదే స్థానంలో కొనసాగుతున్నాడు.

మరిన్ని వార్తలు