సమష్టి మంత్రం... స్వప్నం సాకారం 

16 Mar, 2020 02:22 IST|Sakshi

నిలకడగా రాణించినందుకు

సౌరాష్ట్ర జట్టుకు లభించిన ప్రతిఫలం

స్టార్‌ ఆటగాళ్లు లేకున్నా రంజీ ట్రోఫీ టైటిల్‌ సొంతం

జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌  

ఒకరిద్దరు మినహా భారత్‌కు ఆడిన ఆటగాళ్లెవరూ ఆ జట్టులో లేరు. అయినా దేశవాళీ క్రికెట్‌లో ఈసారి ఆ జట్టు అద్భుతమే చేసింది. ఆద్యంతం నిలకడగా రాణించింది. తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. నాలుగో ప్రయత్నంలో రంజీ ట్రోఫీ చాంపియన్‌గా అవతరించింది. ప్రత్యర్థి ఎవరైనా, పరిస్థితులు ఎలా ఉన్నా, పిచ్‌ ఎలాంటిదైనా ... పక్కా ప్రణాళికతో ఆడితే తుది ఫలితం కోరుకున్నట్లు ఉంటుందని నిరూపించిన జట్టే సౌరాష్ట్ర. గత ఏడాది రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్నా... నిరాశ చెందకుండా ఈసారి మరింత పకడ్బందీగా ఆడిన సౌరాష్ట్ర చాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించింది.

భారత జట్టులోకి పునరాగమనం చేయగల సత్తా నాలో ఉంది. ఆ పట్టుదలే ఈ సీజన్‌లో నేను అద్భుతంగా ఆడేలా ప్రేరేపించింది. దాదాపు ప్రతీ మ్యాచ్‌లో సుదీర్ఘ స్పెల్‌లు వేయాల్సి రావడం శారీరకంగా కూడా నన్ను తీవ్ర శ్రమకు గురి చేసింది. అయితే మేం ఈసారి రంజీ ట్రోఫీ గెలవగలిగాం. ప్రపంచంలో ఇప్పుడు అందరికంటే ఎక్కువగా నేనే సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఐపీఎల్‌లో భారీ మొత్తాలకు అమ్ముడుపోయిన ఆటగాడిగానే చాలా మంది నా గురించి మాట్లాడుతుంటారు. అయితే ఆడేటప్పుడు ఐపీఎల్‌ గురించి ఆలోచన రాదు. ఒక క్రికెటర్‌గా దేశంలో చాలా మందిలాగే మైదానంలో నేనూ కష్టపడతాను. ఇప్పుడు నా రాష్ట్ర జట్టు తరఫున రంజీ గెలవడంతో నా సుదీర్ఘకాల స్వప్నం సాకారమైంది. –జైదేవ్‌ ఉనాద్కట్, సౌరాష్ట్ర కెప్టెన్‌

సాక్షి క్రీడా విభాగం: రంజీ సీజన్‌ ప్రారంభమైన మొదట్లో సౌరాష్ట్ర జట్టు చాంపియన్‌గా అవతరిస్తుందని ఎవరూ ఊహించలేదు. కర్ణాటక, తమిళనాడు, ముంబై, విదర్భ జట్లలో ఒకటి విజేతగా నిలుస్తుందని అంచనా వేశారు. కానీ సౌరాష్ట్ర జట్టు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రంజీ ట్రోఫీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర జట్టుకు    ఆడే భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఒక్క మ్యాచ్‌లోనూ అందుబాటులో లేకుండా పోయాడు. భారత టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా కేవలం ఆరు మ్యాచ్‌ల్లో సౌరాష్ట్రకు ఆడాడు. వీరిద్దరి సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకున్నా సౌరాష్ట్ర సీజన్‌ మొత్తం నిలకడగా రాణించింది.      బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో మెరిపించి ప్రత్యర్థుల ఆట కట్టించింది. భారత క్రికెటర్, జట్టు కెప్టెన్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ అన్నీ తానై సౌరాష్ట్రను ముందుండి నడిపించాడు.

శుభారంభంతో... 
గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సౌరాష్ట్ర 2019–2020 సీజన్‌ను వరుసగా రెండు విజయాలతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో హిమాచల్‌ప్రదేశ్‌పై ఐదు వికెట్ల తేడాతో... రెండో మ్యాచ్‌లో రైల్వేస్‌పై ఇన్నింగ్స్‌ 90 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్రకు ఇన్నింగ్స్‌ 72 పరుగుల తేడాతో ఓటమి ఎదురైంది. ఈ రంజీ సీజన్‌లో సౌరాష్ట్ర ఓడిన ఏకైక మ్యాచ్‌ ఇదే కావడం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌ చేతిలో ఓటమి ఎదురయ్యాక సౌరాష్ట్ర లీగ్‌ దశలో ఆడిన మిగతా ఐదు మ్యాచ్‌ల్లో నాలుంగిటిని ‘డ్రా’ చేసుకొని మరో మ్యాచ్‌లో గెలిచి 41 పాయింట్లతో 18 జట్లున్న ఎలైట్‌ ‘ఎ అండ్‌ బి’ గ్రూప్‌లో 31 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఆంధ్ర జట్టుతో ఒంగోలులో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ను సౌరాష్ట్ర ‘డ్రా’ చేసుకుంది. అయితే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించి సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది.

ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఒకదశలో తొలి ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ చిరాగ్‌ జానీ అద్భుత సెంచరీ, ప్రేరక్‌ మన్కడ్‌ అర్ధ సెంచరీ చేసి సౌరాష్ట్రకు 419 పరుగుల భారీ స్కోరును అందించారు. అనంతరం బౌలింగ్‌లో జైదేవ్‌ ఉనాద్కట్‌ విజృంభణకు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే ఆలౌటైంది. ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఆడించే అవకాశం ఉన్నా సౌరాష్ట్ర రిస్క్‌ తీసుకోకుండా వ్యూహాత్మకంగా రెండో ఇన్నింగ్స్‌ ఆడి మళ్లీ భారీ స్కోరు చేసింది. మాజీ చాంపియన్‌ గుజరాత్‌తో జరిగిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర కెప్టెన్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లోనూ మెరిసిన ఉనాద్కట్‌ సౌరాష్ట్రకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో 28 ఏళ్ల ఉనాద్కట్‌ ఓవరాల్‌గా ఈ సీజన్‌లో అత్యధికంగా 67 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

ఒకరు కాదంటే మరొకరు.... 
జట్టు క్రీడ అయిన క్రికెట్‌లో ఏ ఒక్కరితోనో ఎల్లవేళలా విజయాలు సాధించడం సాధ్యం కాదు. సమష్టి ప్రదర్శన చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఈ సీజన్‌లో సౌరాష్ట్ర విషయంలో ఇదే జరిగింది. జట్టు ఒకరిద్దరు ప్రదర్శనపై ఆధారపడలేదు. ఒక మ్యాచ్‌లో ఒకరు మెరిస్తే మరో మ్యాచ్‌లో ఇతర ఆటగాళ్లు అదరగొట్టారు. ముఖ్యంగా ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్‌ అర్పిత్‌ వసవాడ సెమీఫైనల్లో, ఫైనల్లో సెంచరీలు చేశాడు. ఓవరాల్‌గా టోర్నీ మొత్తంలో అర్పిత్‌ నాలుగు సెంచరీలతో కలిపి మొత్తం 763 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్‌ చిరాగ్‌ జానీ పలు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపెనర్‌ హార్విక్‌ దేశాయ్, వెటరన్‌ ప్లేయర్‌ షెల్డన్‌ జాక్సన్‌ కూడా తమవంతు పాత్ర పోషించారు. షెల్డన్‌ జాక్సన్‌ మొత్తం పది మ్యాచ్‌లు ఆడి మూడు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 809 పరుగులు చేసి సౌరాష్ట్ర తరఫున రంజీ సీజన్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ పుజారా 573 పరుగులు... చిరాగ్‌ జానీ 544 పరుగులు... హార్విక్‌ దేశాయ్‌ 597 పరుగులు... ప్రేరక్‌ మన్కడ్‌ 445 పరుగులు సాధించారు.

స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా లేని లోటును తెలియకుండా మరో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ధర్మేంద్ర సింగ్‌ జడేజా ముఖ్యపాత్ర నిర్వర్తించాడు. అతను ఈ సీజన్‌లో 388 పరుగులు చేయడంతోపాటు 32 వికెట్లు తీసి తనదైన ముద్ర వేశాడు. ఈసారి సౌరాష్ట్ర చాంపియన్‌గా అవతరించడానికి సమష్టి ప్రదర్శనే కారణమని ఆ జట్టు కోచ్‌ నీరజ్‌ ఒదేద్రా అభిప్రాయపడ్డారు. ‘గతంలోనూ సౌరాష్ట్ర బాగా ఆడింది. ఫైనల్స్‌కూ చేరింది. అయితే ఆ సందర్భాల్లో స్టార్‌ ఆటగాళ్లపైనే పూర్తిగా ఆధారపడింది. స్టార్‌ ప్లేయర్లు విఫలమైతే ఫలితం మరోలా వచ్చేది. ఈసారి మాత్రం పరిస్థితి మారింది. ప్రతి ఒక్కరూ తమవంతుగా రాణించడంలో సౌరాష్ట్రకు టైటిల్‌ లభించింది. గత సీజన్‌లో జైదేవ్‌ ఉనాద్కట్‌ జట్టు పగ్గాలు చేపట్టాక ఆటగాళ్ల మైండ్‌సెట్‌లోనూ మార్పు వచ్చింది. ఒకప్పుడు సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభిస్తేనో, ‘డ్రా’ చేసుకుంటేనో సంతృప్తి పడేది. కానీ ఉనాద్కట్‌ కెప్టెన్‌ అయ్యాక సౌరాష్ట్ర ప్రతి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా పోరాడటం అలవాటు చేసుకుంది’ అని నీరజ్‌ అన్నారు.

ఉనాద్కట్‌ నిశ్చితార్థం...

సౌరాష్ట్రను రంజీ చాంపియన్‌గా నిలబెట్టిన కెప్టెన్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ త్వరలోనే ఇంటివాడు కానున్నాడు. ఆదివారం రాజ్‌కోట్‌లో తన ప్రియురాలు రిన్నీతో జైదేవ్‌ వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత టెస్టు క్రికెటర్, సౌరాష్ట్ర ఆటగాడు చతేశ్వర్‌ పుజారాతోపాటు సౌరాష్ట్ర జట్టుకు చెందిన ఇతర సభ్యులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు