జ్వాల సెకండ్‌ ఇన్నింగ్స్‌

30 Jun, 2017 02:08 IST|Sakshi
ఆరిఫ్‌తో జ్వాల (ఫైల్‌)

భారత డబుల్స్‌ కోచ్‌ బాధ్యతలు   
న్యూఢిల్లీ: దేశంలో బ్యాడ్మింటన్‌ క్రీడను మరింతగా అభివృద్ధి చేసేందుకు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) కొత్త అడుగు వేసింది. సీనియర్, జూనియర్‌ విభాగాలతో పాటు సింగిల్స్, డబుల్స్‌ కేటగిరీలకూ ప్రత్యేకంగా కోచ్‌లను నియమించింది. సీనియర్‌ స్థాయిలో పురుషుల సింగిల్స్‌కు దేశంలోని వివిధ జోన్ల నుంచి కొత్తగా 19మంది కోచ్‌లను ఎంపిక చేసిన ‘బాయ్‌’... డబుల్స్‌ విభాగంలో 12 మందిని నియమించింది. వీరితో పాటు మహిళల డబుల్స్‌కూ నలుగురు కోచ్‌లను ప్రకటించింది. వీరంతా జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పర్యవేక్షణలో పనిచేస్తారు.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో మహిళల డబుల్స్‌ విభాగంలో ఎన్నో ఘనతలను సాధించిన హైదరాబాద్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల మహిళల డబుల్స్‌ కోచ్‌గా ఎంపికయ్యారు. జ్వాలతో పాటు మధుమిత బిస్త్, ప్రద్యా్న గాద్రె, ఓలి డెకా మహిళా డబుల్స్‌ షట్లర్లకు శిక్షణనిస్తారు. కొత్తగా కోచ్‌ పదవి దక్కించుకున్న వారిలో భారత మాజీ క్రీడాకారులు అరవింద్, అనూప్‌ శ్రీధర్, చేతన్‌ ఆనంద్, దీపాంకర్‌ భట్టాచార్జి పురుషుల సింగిల్స్‌ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.

డబుల్స్‌ విభాగంలో అక్షయ్‌ దివాల్కర్, అరుణ్‌ విష్ణు, థామస్, రూపేశ్‌ కుమార్‌లతో పాటు విజయ్‌దీప్‌ సింగ్, ఉదయ్‌ పవార్‌ కోచ్‌లుగా ఉంటారు. కోచ్‌లతో పాటు ‘బాయ్‌’ ఏర్పాటు చేసిన సలహాదారుల బృందంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్‌ఎం ఆరిఫ్‌కు చోటు దక్కింది. ఆరిఫ్‌తో పాటు ఈ బృందలో సంజీవ్‌ సచ్‌దేవ్, రోషన్‌ లాల్‌ నహర్, గంగూలీ ప్రసాద్‌ ఉంటారు. జూనియర్‌ స్థాయిలోనూ ‘బాయ్‌’ 21 మంది పురుషులు, 10మంది మహిళా కోచ్‌లను నియమించింది. ఇందులో హైదరాబా ద్‌కు చెందిన గోవర్ధన్‌ రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, మాజీ ఆటగాడు జేబీఎస్‌ విద్యాధర్‌ కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు