కేరళ బ్లాస్టర్స్‌ హెడ్‌ కోచ్‌పై వేటు

23 Apr, 2020 05:18 IST|Sakshi
ఈల్కో స్కాటోరి

ఈల్కో స్కాటోరిని తప్పించినట్లు వెల్లడి

న్యూఢిల్లీ: కేరళ బ్లాస్టర్స్‌ హెడ్‌ కోచ్‌ ఈల్కో స్కాటోరిని తప్పించినట్లు ఆ జట్టు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీలో కేరళ ఫ్రాంచైజీ తరఫున కేవలం ఒక సీజన్‌కు మాత్రమే పనిచేసిన ఈల్కో అంచనాలకు తగినట్లు రాణించలేకపోయాడు. 2019–20 ఐఎస్‌ఎల్‌ సీజన్‌లో ఈల్కో పర్యవేక్షణలోని కేరళ జట్టు 19 పాయింట్లతో ఏడో స్థానానికే పరిమితమై నిరాశపరిచింది. ‘కేరళ బ్లాస్టర్‌ ఎఫ్‌సీతో హెడ్‌ కోచ్‌ ఈల్కో బంధం ముగిసింది. కోచ్‌గా అతను అందించిన సేవలకు ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం. అతనికి భవిష్యత్‌లో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాం’ అని కేరళ బ్లాస్టర్స్‌ యాజమాన్యం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. నెదర్లాండ్స్‌కు చెందిన 48 ఏళ్ల ఈల్కో ఐఎస్‌ఎల్‌లో కేరళ కన్నా ముందు నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌(2018–19)కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించి ఆ జట్టు తొలిసారి సెమీస్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు.

మరిన్ని వార్తలు