CWC 2023- Hyd: షమీ మెరుపులు.. కోహ్లీ, గిల్, రోహిత్, అయ్యర్‌ హిట్టింగ్‌ చూడాలని ఆశ

19 Nov, 2023 11:04 IST|Sakshi

మూడోసారి కప్‌ ఖాయం.. ఫైనల్‌ మ్యాచ్‌ చూసేందుకు సిటీ సిద్ధం

నేడు తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా జట్లు   

నగరం.. క్షణ క్షణం.. ఉత్కంఠభరితం  

రిసార్టులు, బార్‌లు, రెస్టారెంట్లలో భారీ స్క్రీన్‌ల ఏర్పాటు 

గేటెడ్‌ కమ్యూనిటీల్లో సామూహిక వీక్షణలు 

మళ్లీ దీపావళి వచ్చిందా అనేలా టపాసుల విక్రయాలు  

మూగబోనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం  

ట్రోఫీని ముద్దాడే అరుదైన క్షణాల కోసం ఉవ్విళ్లు

కప్‌ గెలిస్తే అపురూపంగా మురవనున్న ప్రతి ఇల్లూ

పుష్కర కాలంగా ఎదురుచూస్తున్న ఉద్విగ్న ఘట్టానికి టీమ్‌ ఇండియా ఒక్క అడుగు దూరంలోనే ఉంది. భారత క్రికెట్‌ చరిత్రలో ముచ్చటగా మూడోసారి వరల్డ్‌ కప్‌ ట్రోఫీని ముద్దాడటానికి మరో అద్భుతమైన అవకాశం మన ముంగిట్లోకొచ్చింది.

లీగ్‌ దశలో పరాజయమే లేకుండా  విజయ పరంపరతో దూసుకెళుతున్న భారత జట్టు.. అదే దూకుడుతో ఫైనల్‌ మ్యాచ్‌లోనూ వీర విజృంభణతో దూసుకెళ్లి.. గెలుపు తీరాలను చేరుకుంటుందని నగర వాసులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగే వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న నేపథ్యంలో సిటీలో క్రికెట్‌ అభిమానులు క్షణ.. క్షణం ఊపిరి సలపని వీక్షణంలో మునిగిపోనున్నారు. వరల్డ్‌ కప్‌ మనదేననే ధీమా వ్యక్తంచేస్తున్నారు. ట్రోఫీని భారత్‌ కైవసం చేసుకుంటే.. సంబరాలకు అవసరమైన సరంజామాను సిద్ధం చేసుకుంటున్నారు.  – సాక్షి, సిటీబ్యూరో

అహ్మదాబాద్‌ వేదికగా నేటి వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు విద్యార్థులు, ఉద్యోగులూ, వ్యాపారులూ, సెలబ్రెటీలు తదితర క్రికెట్‌ క్రీడాభిమానులంతా సిద్ధమయ్యారు. ముఖ్యంగా రిసార్ట్స్, బార్లు, రెస్టారెంట్లతో పాటు పలు పబ్లిక్‌ ప్లేస్‌లలో భారీ లైవ్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు.

ఈ రోజు పెళ్లి చేసుకోబోతున్న ఓ నూతన జంట తమ వివాహ మంటపంలో వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయనున్నామని సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌ చేయడం గమనార్హం. విల్లాలు, పలు గ్రేటెడ్‌ కమ్యూనిటీల్లోనూ సామూహిక విక్షణకు ఇప్పటికే అన్ని సిద్ధమయ్యాయి.

ఇదే సమయంలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి యువకులు దూరంగా ఉన్నారని ఓ రాజకీయ నాయకుడు చెప్పారు. దీపావళి మళ్లీ జరుగుతుందా అనేంతలా బాణాసంచాలు అమ్ముడుపోయాయని నగరానికి చెందిన ఓ టపాసుల వ్యాపారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ఈసారి వేరే లెవెల్‌.. 
వరల్డ్‌కప్‌లో గతంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లు వేరు. ఈ రోజు జరగనున్న మ్చాచ్‌ వేరే లెవెల్‌. ఈసారి భారత బృందం ఆటతీరు అందరి మనసులను గెలుచుకుంది. అలాగే కప్‌ నెగ్గి మరోసారి భారత క్రికెట్‌ క్రీడా శక్తిని ప్రపంచానికి చూపించనుంది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీ కనిపించని అద్భుత శక్తిని తలపిస్తుంది. దానికి తగ్గట్టుగా క్రీడాకారుల పోరాట పటిమ ప్రతీ భారతీయుడికి గర్వకారణంగా నిలుస్తుంది.  
– సంతోష్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

2011 విజయం పునరావృతం..
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన క్షణాలు నిజం కానున్నాయి. ఒక భారత క్రీడాభిమానిగా భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని సెల్యూట్‌ కొట్టడానికి ఎదురుచూస్తున్నాను. మరోసారి మహ్మద్‌ షమీ బౌలింగ్‌ మెరుపులు, కోహ్లీ, గిల్, రోహిత్, అయ్యర్‌ హిట్టింగ్‌ చూడాలని ఆశగా ఉన్నాను. ధోనీ ఆధ్వర్యంలోని 2011 విజయం మళ్లీ రోహిత్‌ శర్మ వ్యూహాలతో పునరావృతం అవుతుందని ఆశిస్తున్నాను.
– రాం రెడ్డి, క్రికెట్‌ అభిమాని, అల్వాల్‌

మరిన్ని వార్తలు