CWC 2023 Ind vs Aus: 2003లో ఓడిపోయాం.. కానీ ఈసారి ట్రోఫీ మనదేనన్న అజారుద్దీన్‌, ఓజా

19 Nov, 2023 11:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం సమీపించింది. మరికొన్ని గంటల్లో వన్డే వరల్డ్‌-2023 ఫైనల్‌ పోరుకు తెరలేవనుంది. అహ్మదాబాద్‌ వేదికగా అజేయ టీమిండియా- ఐదుసార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియాతో టైటిల్‌ పోరులో తలపడనుంది. ఇరవై ఏళ్ల క్రితం కంగారూ జట్టు చేతిలో ఎదురైన ఫైనల్‌ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్‌ సేన పట్టుదలగా ఉంది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌, రాజకీయ నాయకుడు మహమ్మద్‌ అజహరుద్దీన్ టీమిండియాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. ‘‘ఈ రోజు మ్యాచ్‌ రసవత్తరంగా ఉంటుంది. భారత్‌ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ముఖ్యంగా టాప్‌ ఆర్డర్, బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది.  

ముందుగా బ్యాటింగ్‌ చేయాలా.. బౌలింగ్‌ చేయాలా అన్నది పిచ్‌పై ఆధారపడి ఉంటుంది. 2003లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఓడిపోయాం. ఈసారి భారత జట్టు గెలిచి ప్రపంచ కప్‌ను అందుకుంటుంది. ప్రచారంలో ఉంటూనే తీరికవేళ మ్యాచ్‌ను తిలకిస్తాను’’ అని అజారుద్దీన్‌ ‘సాక్షి’కి తెలిపారు. కాగా మేటి క్రికెటర్‌గా పేరొందిన అజారుద్దీన్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

ఒత్తిడిని జయించిన తీరు అద్భుతం: ఓజా
అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా సాక్షితో మాట్లాడుతూ..  ‘‘లీగ్‌ దశ నుంచి ఒత్తిడిని జయిస్తూ మన భారత క్రీడాకారులు ప్రదర్శించిన క్రీడా నైపుణ్యాలు ఎంతో స్ఫూర్తి నింపాయి. ఎలాంటి తడబాటు లేకుండా క్రికెట్‌ ఫేవరెట్‌ టీంలను సైతం చిత్తు చేయడం కప్‌ను సాధిస్తామని చెప్పకనే చెప్పారు. 

బ్యాటింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో పాటు బౌలింగ్‌లో దూసుకుపోతున్న తీరు చూస్తూ ప్రతీ భారతీయుడు ఇప్పటికే విజయాన్ని ఖాయం చేసుకున్నారు. భారత క్రికెట్‌ ఆటగాడిగానే కాకుండా క్రికెట్‌కు అతిపెద్ద అభిమానిగా మరోసారి వరల్డ్‌ కప్‌ భారత ఒడిలో చేరుతుందని నమ్మకంగా ఉన్నాను’’ అని రోహిత్‌ సేన విజయంపై ధీమా వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు