పొలార్డ్‌కు ఏమైంది.. గాల్లోకి బ్యాట్‌ విసిరేసి.. నిరసన

13 May, 2019 08:35 IST|Sakshi

అంపైర్లపై అసహనం.. పోలార్డ్‌కు భారీ జరిమానా

సాక్షి, హైదరాబాద్‌: ఆదివారం 32వ వసంతంలోకి అడుగుపెట్టిన కీరన్‌ పొలార్డ్‌ చెన్నైతో ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా అంపైర్ల తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అజేయంగా 41 పరుగులు చేసి.. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన పొలార్డ్‌.. జట్టు విజయంలోనూ కీలకమయ్యాడు. అయితే, చెన్నై బౌలర్‌ డ్వేన్‌ బ్రావో వేసిన చివరి ఓవర్‌లో వరుసగా రెండు బంతులు ట్రామ్‌లైన్స్‌ దాటి దూరంగా వెళ్లాయి. మొదటి బంతిని ఆడేందుకు ప్రయత్నించిన పొలార్డ్‌.. రెండో బంతి కూడా దూరంగా వెళ్లడంతో వైడ్‌గా భావించి వదిలేశాడు. వైడ్‌గా వెళ్లిన ఈ రెండు బంతులను ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌.. లీగల్‌ బంతులుగానే గుర్తించాడు. క్రీజ్‌కు దూరంగా బంతులు వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్‌ వైడ్‌ ఇవ్వకపోవడంతో పొలార్డ్‌కు బాగా కోపం వచ్చింది. కోపాన్ని అణచుకోలేకపోయిన పొలార్డ్‌ బ్యాటును గాల్లోకి ఎగరవేశాడు. ఆ తర్వాత బంతి వేసేందుకు బ్రావో సన్నద్ధమవుతుండగా.. అంతకుముందు బంతి ఎక్కడి నుంచి వెళ్లిందో దాదాపు అక్కడ  (ట్రామ్‌లైన్స్‌ దగ్గర) నిలబడి బ్రేవోను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. పొలార్డ్‌ వికెట్లకు పూర్తిగా పక్కకు జరగడంతో బౌలింగ్‌ చేసేందుకు వచ్చిన బ్రేవో మధ్యలో విరమించుకోవాల్సి వచ్చింది. క్రీజ్‌ నుంచి బయటకు వచ్చి.. .. పోలార్డ్‌ అసహనం ప్రకటించడంతో బిత్తరపోయిన ఇద్దరు అంపైర్లు అతని వద్దకు వచ్చి సముదాయించారు.

ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం పోలార్డ్‌కు జరిమానా విధించారు. అతడు మ్యాచ్‌ ఫీజులో 25శాతం జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించారు. అయితే, పోలార్డ్‌ చేసిన తప్పిదమేమిటో ఐపీఎల్‌ క్రమశిక్షణ కమిటీ వెల్లడించలేదు. అంపైర్ల నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి ప్రకటించినందుకే అతనికి ఈ శిక్ష విధించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి :
కోపంతో బ్యాటును గాల్లోకి ఎగరవేసిన పొలార్డ్‌

మరిన్ని వార్తలు