అదొక చెత్త: రవిశాస్త్రి

10 Sep, 2019 16:39 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయని పదే పదే వార్తలు రావడంపై జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి మరోసారి స్పందించాడు. అసలు ఇద్దరు అగ్రశ్రేణి క్రికెటర్ల మధ్య కావాలనే రూమర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డాడు. గత ఐదేళ్లుగా తాను భారత ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకుంటున్నానని, తానైతే ఎవరి మధ్య ఎటువంటి విభేదాలు చూడలేదన్నాడు. కోహ్లి-రోహిత్‌ల మధ్య విభేదాలు అనేవి ఒక చెత్త వార్తే తప్పితే అంతకంటే ఏమీ లేదన్నాడు. ‘టీమిండియా ఆటగాళ్లంతా ఎలా ఆడాలనే దానిపై దృష్టి పెట్టడమే నేను చూశా. అదే జరుగుతుంది కూడా. వరల్డ్‌కప్‌లో మనం చూసింది ఇదే. రోహిత్‌ ఐదు సెంచరీలు చేశాడు. కోహ్లి ఎంతగా ఆకట్టుకున్నాడో కూడా చూశాం.

రోహిత్‌-కోహ్లిలు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను కచ్చితంగా చెప్పగలను రోహిత్‌-కోహ్లిల మధ్య ఎటువంటి విభేదాలు చోటు చేసుకోలేదని’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇక కోహ్లి స్పందిస్తూ.. ‘ అటువంటి వార్తలు చదవడం కూడా కష్టంగానే ఉంది. ఏదో ఒకటి చేయాలనే తపనతో అలా తప్పుడు రూమర్లను ప్రచారం చేస్తున్నారు. కేవలం అసత్యాలను మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో మంచి విషయాలు చోటు చేసుకుంటే వాటిని మాత్రం మరుగున పడేస్తున్నారు’ అని కోహ్లి ఆవేదన వ్యక్తం చేశాడు.

>
మరిన్ని వార్తలు